ఎన్ఎస్ఈ సీఈఓగా వైదొలిగిన చిత్ర రామకృష్ణ
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ఎండీ, సీఈఓగా చిత్ర రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్‌ఎస్‌ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే, ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్‌ఎస్‌ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ‘‘చిత్ర రాజీనామాను బోర్డ్ ఆమోదించింది. ఎన్‌ఎస్‌ఈ పురోభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు.
పదవిలో కొంత కాలం కొనసాగాలని బోర్డ్ ఆమెను అభ్యర్థించినా... ఆమె మాత్రం తక్ష ణం వైదొలగాలని నిర్ణరుుంచుకున్నారు. అందుకని ఎన్‌ఎస్‌ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు’’ అని ఎన్‌ఎస్‌ఈ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. 1992లో ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటైనప్పటినుంచి వివిధ హోదాల్లో చిత్ర రామకృష్ణ పనిచేశారు. 2013, ఏప్రిల్‌లో ఆమె ఎండీ, సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రవి నారాయణ్ స్థానంలో ఆమె వచ్చారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్సేంజేస్‌కు చైర్‌పర్సన్‌గా గతనెలలోనే ఎంపికయ్యారు. ఎన్‌ఎస్‌ఈ హెడ్‌గా పనిచేసిన మూడో వ్యక్తి చిత్ర. కాగా రవి నారాయణ్‌తో ఆమెకు ఏర్పడిన విభేదాలే ఈ రాజీనామాకు కారణమని అనధికారిక వర్గాల సమాచారం.