సామాన్యుడికీ విమానయోగం.. | Civil Aviation Ministry's Regional Connectivity Scheme “UDAN” | Sakshi
Sakshi News home page

సామాన్యుడికీ విమానయోగం..

Published Fri, Oct 21 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

సామాన్యుడికీ విమానయోగం..

సామాన్యుడికీ విమానయోగం..

గంట ప్రయాణానికి గరిష్ట చార్జీ రూ.2,500
ఉడాన్ పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
జనవరి నుంచి స్కీమ్ అమలు...
దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాల అభివృద్ధి
వరంగల్లు, కడప విమానాశ్రయాలకు చాన్స్
ప్రాంతీయంగా ఊపందుకోనున్న సేవలు

 సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి చేరువ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్’ (ఉదే దేశ్‌కా ఆమ్ నాగరిక్)ను ఆవిష్కరించింది. ఈ పథకం కింద చిన్న పట్టణాలకు విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. గరిష్టంగా రూ.2,500కే ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఉడాన్ పథకం కింద తొలి విమానయాన సర్వీసు వచ్చే జనవరిలో ప్రారంభం అవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. ఈ పథకం వివరాలను శుక్రవారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హాతో కలసి వెల్లడించారు.

రూ. 2,500లకే 500 కి.మీ. మేర ప్రయాణానికి వీలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని వెల్లడించారు. అభివృద్ధి, చవకైన విమానయానం, ప్రాంతీయ అనుసంధానం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్టు వివరించారు. ఈ పథకం అటు ఆపరేటర్లకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనకారిగా ఉంటుందని, మౌలిక వసతులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని వివరించారు.

50 విమానాశ్రయాల అభివృద్ధి..
దేశవ్యాప్తంగా వారానికి ఏడులోపు వాణిజ్యపరమైన సర్వీసులు అందించే (అండర్ సర్వ్‌డ్) ఎయిర్‌పోర్టులు 16, ఎలాంటి వాణిజ్యపరమైన సర్వీసులు అందించని (అన్‌సర్వ్‌డ్) విమానాశ్రయాలు 394 ఉన్నాయని, వీటిలో 50 ఎయిర్‌పోర్టులను ఉడాన్ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇందులో రాష్ట్రాలదే కీ లకపాత్ర అని వెల్లడించారు. రాష్ట్రాల ప్రతిపాదనలు, సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చే ఎయిర్ లైన్స్ సంస్థల చొరవను బట్టి ఆయా ఎయిర్‌పోర్టులు సేవలందిస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌కు 20 శాతం తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

వరంగల్లు విమానాశ్రయానికి అవకాశం
తెలంగాణలో వరంగల్లులో ఇదివరకే ఉన్న ఎయిర్‌పోర్టు ‘ఉడాన్’ స్కీమ్ కింద సేవలు అందించేందుకు వీలుందని మంత్రి అశోక్‌గజపతిరాజు వెల్లడించారు అలాగే, ఆలేరు, బసంత్‌నగర్, దుండిగల్, హకీంపేట, కాగజ్‌పూర్(సిర్పూరు), నాదర్‌గుల్, నల్గొండలో అన్‌సర్వ్‌డ్ విమానాశ్రయాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఆయా విమానాశ్రయాలు మనుగడలోకి వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సమయం పడుతుందని చెప్పారు.

కడప విమానాశ్రయం అభివృద్ధి
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కడప విమానాశ్రయం తాజా ఉడాన్ స్కీమ్ కింద మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో బొబ్బిలి, దొనకొండ, నెల్లూరు, పుట్టపర్తిలో అన్‌సర్వ్‌డ్ విమానాశ్రయాలు ఉన్నాయని మంత్రి వివరించారు.

లెవీ పట్ల ఎయిర్‌లైన్స్ సంస్థల వ్యతిరేకత
అయితే, ఈ పథకం కోసం ఆదాయం రాబట్టుకునేందుకు లెవీ విధించాలన్న ప్రభుత్వ ఆలోచనను ఎయిర్‌లైన్స్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల ధరలు భారీగా పెరిగిపోతాయని, ఉడాన్ పథకానికి నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని అవి పేర్కొన్నాయి. ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి నిధులు సమకూర్చుకోవాలని స్పైస్‌జెట్ ఎండీ అజయ్‌సింగ్ సూచించారు. కాగా, లెవీకి సంబంధించిన నిబంధనలను రెండు రోజుల్లో గెజిట్‌లో పేర్కొంటామని, కార్యనిర్వాహక ఆదేశాలు ఈ నెలాఖరులోగా వెలువడతాయని పౌర విమానయాన శాఖ సెక్రటరీ ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. లెవీ చాలా స్వల్పంగానే ఉంటుందన్నారు.

ఉడాన్’ పథకం వివరాలు..
దేశంలో ప్రస్తుతం విమానయాన సేవలు అంతగా అందుబాటులో లేని (అండర్ సర్వ్‌డ్), అసలే అందుబాటులో లేని (అన్‌సర్వ్‌డ్) ప్రాంతాల అనుసంధానానికి వీలుగా రూపొదించిన పథకమే ఉదాన్. పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రాంతీయంగా సర్వీసులను అందించే ఎయిర్‌లైన్స్‌ను బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ పథకానికి నిధుల సాయం కోసం మేజర్ రూట్లలో టేకాఫ్ అయ్యే ప్రతీ విమానయాన సర్వీసుపై స్వల్పంగా లెవీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్ణయించిన రూ.2,500 చార్జీ పరిమితి విమానంలోని సగం సీట్లకే వర్తిస్తుంది. 476 నుంచి 500 కిలోమీటర్ల దూరం మధ్య నడిచే ప్రాంతీయ విమానయాన సర్వీసులు (గంట వ్యవధిలోపు) ఈ పరిమితి కిందకు వస్తాయి. మిగిలిన సీట్లకు మార్కెట్ రేటు ప్రకారం చార్జీ ఉంటుంది. ఇదే నిబంధన హెలికాప్టర్ సర్వీసులకు కూడా అమల్లో ఉంటుంది. హెలికాప్టర్‌లో అరగంట విహారానికి  రూ. 2,500, గంటకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఈ పథకంలో పాలు పంచుకునే ఎయిర్‌లైన్స్ సంస్థలకు విమానయాన ఇంధనం (జెట్ ఫ్యూయల్)పై 2 శాతం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ రాయితీలు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఎలాంటి పన్నులు, చార్జీలు వసూలు చేయదు. సేవా పన్ను కూడా టికెట్ల విలువలో కేవలం పది శాతంపైనే ఉంటుంది. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సాయం కూడా అందుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement