
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు అందిస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పడ్డ యూనిట్లను తెరిచేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నట్టు తెలిపారు.
ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) దక్షిణ ప్రాంత మండలి తొలి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీలకు చేయూతనివ్వాల్సిందిగా ఐసీసీ ప్రతినిధులను కోరారు. రానున్న రోజుల్లో ఎస్‌ఎం ఈలే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనున్నాయని అన్నారు. మంచి వ్యాపార ఆలోచన ఉండి కూడా మెంటార్‌షిప్ లేక విఫలమైన కంపెనీలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ఐసీసీ దక్షిణ ప్రాంత మండ లి చైర్మన్ రాజీవ్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్ శాశ్వత్ గోయెంకా, చాంబర్ ప్రతినిధులు మయంక్ జలాన్, రాజీవ్ సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment