
మార్కెట్‌కు ‘పొగ’..!
♦ సిగరెట్లపై సెస్ విధింపుతో ఐటీసీ 15 శాతం క్రాష్
♦ సెన్సెక్స్ 364 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు డౌన్
♦ ఈ ఏడాది ఇదే అతిపెద్ద క్షీణత...
ముంబై: త్వరలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చరిత్రలో మొదటిసారిగా 10,000 మార్కును చేరవచ్చన్న ఇన్వెస్టర్ల ఆశల్ని తలకిందులు చేస్తూ మంగళవారం స్టాక్ మార్కెట్ నిలువునా పతనమయ్యింది. ప్రభుత్వం సిగరెట్లపై గతంలో ఎత్తివేసిన సెస్‌ను తిరిగి విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హెవీవెయిట్ షేరు ఐటీసీ మంగళవారం దాదాపు 13 శాతం పతనంకావడంతో ప్రధాన సూచీలు పడిపోయాయి. రెండురోజులుగా పాగావేసిన 32,000 పాయింట్ల శిఖరాన్ని కోల్పోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 364 పాయింట్లు (1.13 శాతం) పతనమై 31,711 పాయింట్ల వద్ద ముగిసింది.
2017వ సంవత్సరంలో సెన్సెక్స్ ఇంతగా పతనం కావడం ఇదే ప్రథమం. గతేడాది నవంబర్ 21న జరిగిన 385 పాయింట్ల పతనం తర్వాత ఇదే పెద్ద క్షీణత. ఈ సూచీ ఇంట్రాడేలో 400 పాయింట్లకుపైగా తగ్గి 31,626 పాయింట్ల కనిష్టస్థాయిని కూడా తాకింది. ఇక క్రితం రోజే 9,940 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ వెళ్లిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 9,900, 9,800 పాయింట్ల స్థాయిల్ని సైతం వదులుకుంది. 9,792 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన తర్వాత చివరకు 89 పాయింట్ల నష్టంతో (0.90 శాతం) 9,827 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
జీఎస్‌టీ సెస్‌తోనే తంటా...
జీఎస్‌టీ అమలు నేపథ్యంలో సిగరెట్ తయారీ సంస్థలకు గతంలో వున్న అదనపు సెస్‌ను ఇంతకుమునుపు ప్రభుత్వం తొలగించింది. అయితే సెస్ తొలగింపుతో కంపెనీలు అధికంగా లబ్దిపొందుతున్నాయన్న కారణంగా సెస్‌ను తిరిగి విధించాలని జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. సిగరెట్లపై జీఎస్‌టీకి తోడు అదనంగా సెస్ విధింపుతో నిఫ్టీ అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. కార్పొరేట్ ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగురూకతతో వ్యవహరించడంతో మార్కెట్ క్షీణత అధికంగా వుందని ఆయన వివరించారు. అయితే రూపాయి బలంగా ట్రేడవుతుండటం, ఎన్‌పీఏలు పరిష్కారమవుతాయన్న అంచనాలతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు మంగళవారం రికవరీ కావడంతో నిఫ్టీ 10,000 పాయింట్లస్థాయిని చేరుతుందన్న ఆశలు సజీవంగా వున్నట్లేనని ఆయన అన్నారు.
రూ. 50,000 కోట్ల విలువ కోల్పోయిన ఐటీసీ
దేశంలో సిగరెట్ తయారీ దిగ్గజం ఐటీసీ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 12.6 శాతం పతనమై రూ. 284.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 15 శాతంపైగా పతనమై రూ. 277 స్థాయిని తాకింది. గత 25 సంవత్సరాల్లో ఐటీసీ షేరు ఒక్కరోజే ఇంతిలా పతనంకావడం ఇదే ప్రధమం. ఈ షేరుకు ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల్లో 10 శాతం వరకూ వెయిటేజీ వున్న ఫలితంగా ఆయా సూచీలు కూడా బాగా తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 15 కోట్ల ఐటీసీ షేర్లు చేతులు మారాయి. ఈ ఒక్కరోజే ఐటీసీ మార్కెట్ విలువ రూ. 50,000 కోట్ల మేర హరించుకుపోయింది. దీని మార్కెట్ విలువ రూ. 3.96 లక్షల కోట్ల నుంచి రూ. 3.46 లక్షల కోట్లకు పడిపోయింది. ఇతర సిగరెట్ తయారీ కంపెనీలు గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ షేర్లు 7 శాతం వరకూ క్షీణించాయి.
రిలయన్స్ కూడా..
సూచీల తగ్గుదలకు మరో కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు క్షీణత. పన్నాతపతి చమురు క్షేత్రానికి సంబంధించి రూ. 18,000 కోట్ల రాయల్టీని పెనాల్టీగా చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆ క్షేత్రంలో 30 శాతం వాటా కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతంమేర క్షీణించి రూ. 1,520 వద్ద ముగిసింది. తగ్గిన షేర్లలో ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా వున్నాయి. మరోవైపు సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హీరో మోటో కార్ప్‌లు 2 శాతం వరకూ పెరిగాయి.