డిసెంబర్‌కల్లా రిలయన్స్ 4జీ
41వ ఏజీఎంలో ఆర్‌ఐఎల్ చీఫ్ ముకేశ్ అంబానీ వెల్లడి
- రూ. 4 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్; నెలవారీ బిల్లు రూ.300-500
- వచ్చే 12-18 నెలల్లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి
ముంబై: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) 4జీ టెలికం సేవలు ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ప్రారంభం కానున్నాయి. అంతేకాదు కేవలం రూ.4 వేలకు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించడమే కాకుండా.. నెలవారీ బిల్లు కూడా రూ.300-500కే పరిమితం కానుంది. శుక్రవారమిక్కడ జరిగిన 41వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ వివరాలను ప్రకటించారు. ఆర్‌ఐఎల్‌కు చెందిన టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తోంది(బీటా లాంచ్).
కొద్ది నెలల్లో ఇది పూర్తిచేసి డిసెంబర్‌లోగా వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ఆరంభించే సన్నాహాల్లో ఉంది. సోదరుడు అనిల్ అంబానీ నుంచి విడిపోయాక మళ్లీ దశాబ్ద కాలం తర్వాత ముకేశ్ అంబానీ టెలికం రంగంలోకి అడుగుపెట్టారు. కాగా, రిలయన్స్ జియోకు దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రం లెసైన్స్‌తో పాటు వాయిస్ సేవల లెసైన్స్ కూడా ఉంది.
కేబుల్ ప్రసారాల రంగంలోకి కూడా...
వాయిస్, డేటా సేవలకు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 4జీ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4 వేలలోపే ఉండేలా చూస్తామని అంబానీ పేర్కొన్నారు. ‘పల్లెలు, పట్టణాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతిఒక్కరికీ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సేవలను అందించాలన్నదే మా ప్రణాళిక. ఇలాంటి పవర్ 10-15 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మేం దీన్ని భారత్‌లో అందరికీ సాకారం చేయనున్నాం. నెలకు రూ.300-500 ఖర్చుతోనే’ అని ముకేశ్ తెలిపారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా 100% నెట్‌వర్క్ కవరేజీని సాధించాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు. దేశవ్యాప్త కేబుల్ టీవీ ప్రసారాల్లోకి కూడా అడుగుపెట్టనున్నామని.. దీనికోసం మల్టీ-సిస్టమ్ ఆపరేటర్(ఎంఎస్‌ఓ) లెసైన్స్‌కు దరఖాస్తు చేసిన విషయాన్ని కూడా ముకేశ్ వివరించారు. పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ కోసం కూడా ఎస్‌బీఐ భాగస్వామ్యంతో ఆర్‌ఐఎల్ దరఖాస్తు చేసింది.
రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు...
దేశీ కార్పొరేట్ రంగంలో నంబర్ వన్‌గా నిలుస్తున్న ఆర్‌ఐఎల్.. తమ ప్రధాన వ్యాపారమైన చమురు, పెట్రోకెమికల్స్ రంగంలోనూ మరింత దృష్టిసారించనుంది. వచ్చే 12-18 నెలల వ్యవధిలో టెలికంతో పాటు చమురు, పెట్రోకెమికల్స్ తదితర విభాగాల్లో సామర్థ్యాన్ని భారీగా విస్తరించినున్నామని ముకేశ్ తెలిపారు.
మార్చికల్లా మళ్లీ పెట్రోలు బంకులన్నీ రెడీ...
చమురు-గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి(ఈఆర్‌పీ) వ్యాపారంలో పెట్టుబడి వ్యయం కంటే ప్రస్తుతం వాటాదారులకు లభిస్తున్న రాబడి తక్కువగానే ఉందని.. దీనికి ప్రధానంగా నియంత్రణపరమైన సవాళ్లే కారణమని ముకేశ్ చెప్పారు. సహజవాయువు ధర నిర్ణయంలో ఉత్పత్తి సంస్థలకే స్వేచ్ఛనివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. డీజిల్ ధరలపై కూడా నియంత్రణ ఎత్తివేయడంతో గతంలో మూసేసిన 1,400 పెట్రోలు బంకులను మళ్లీ తెరవడంపై దృష్టిపెట్టామని.. అయితే, ప్రభుత్వ రంగ చమురు రిటైలర్లతో పోటీపడటం తమ లక్ష్యం కాదని ముకేశ్ చెప్పారు. ఇప్పటికే 400 బంకులను తెరిచామని.. మిగతావి కూడా ఈ ఆర్థిక సంవతరం చివరికల్లా అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్ అధిపతి వివరించారు.
రిలయన్స్ రిటైల్.. ఆన్‌లైన్ స్టోర్స్
ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్‌పై దృష్టిపెట్టింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కిరాణా-ఆహారోత్పత్తులు తదితర విభిన్న విభాగాల్లో ఆన్‌లైన్ స్టోర్స్‌ను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ జియో ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాను ఈ ఆన్‌లైన్ స్టోర్స్ కోసం వినియోగించుకోనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ రిటైల్ విభాగాలకు సంబంధించి 200 పట్టణాలు, నగరాల్లో ఉన్న స్టోర్లను 900 పట్టణాలకు పైగా విస్తరించనున్నామని కూడా ఆయన వెల్లడించారు.
వాటాదార్ల ప్రశ్నల వర్షం..
కంపెనీ వాటాదారులు ఏజీఎంలో ముకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా ఆర్‌ఐఎల్ షేరు పతనం, నష్టాల్లో ఉన్న మీడియా వ్యాపారంపై ఎక్కువగా ప్రశ్నించారు. అంతేకాకుండా.. రూ.2.14 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నప్పటికీ.. అధిక మొత్తంలో డివిడెండ్‌లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఒక ఇన్వెస్టరు ముకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఏజీఎంలో దాదాపు 50 మంది వాటాదారులు తమ గొంతు వినిపించారు. వీళ్లలో ఎక్కువ మంది షేరు ధర పతనం గురించే మాట్లాడటం గమనార్హం. అయితే, రూ.3 లక్షల కోట్లకుపైగా భారీ పెట్టుబడి ప్రణాళికలు దాదాపు ముగింపు దశకు వచ్చాయని.. షేర్ల బైబ్యాక్/బోనస్ షేర్లు/ డివిడెండ్‌లపై బోర్డు దృష్టిపెడుతుందని ముకేశ్ పేర్కొన్నారు.