న్యూఢిల్లీ: బీమా బిల్లును పార్లమెంటు ఆమోదించడం దేశీ ఇన్సూరెన్స్ రంగ సంస్థల్లో ఉత్సాహం నింపింది. ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు పలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్లు (జేవీ) ఏర్పాటు చేసిన దేశీ బీమా సంస్థలు తెలిపాయి. ఇక, జేవీల్లో విదేశీ భాగస్వామ్య కంపెనీలు వాటాలు పెంచుకోవడానికి మార్గం సుగమమైందని గురువారం బిల్లు ఆమోదం పొందిన కొద్ది సేపటికే ప్రకటించాయి. భారతీ, రిలయన్స్, ఎస్‌బీఐ గ్రూప్, మ్యాక్స్ తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. పరిమితి పెంపు ద్వారా బీమా రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 48,000 కోట్లు-రూ. 60 వేల కోట్లు) రాగలవని కంపెనీలు అంచనా వేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి ఇది సానుకూల పరిణామమని ఫ్రాన్స్‌కి చెందిన యాక్సాతో జేవీ ఏర్పాటు చేసిన భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. జాయింట్ వెంచర్‌లో యాక్సా ఇక తన వాటాలను 49 శాతానికి పెంచుకుంటుందని, ఇందుకోసం త్వరలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కు దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ‘తాజా పరిణామంతో ఇన్సూరెన్స్ రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయంగా బీమాను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. జీవిత బీమా వెంచర్‌లో తమ వాటాలను పెంచుకునేందుకు మా భాగస్వామ్య సంస్థలతో చర్చలు మొదలుపెడతాం’ అని రిలయన్స్ క్యాపిటల్ సీఈవో శామ్ ఘోష్ చెప్పారు. బీమా కంపెనీలు పెట్టుబడులు సమకూర్చుకునేందుకు మరో వనరు లభించినట్లవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు.
అనిశ్చితి తొలగింది..: బీమా బిల్లు ఆమోదంతో అనిశ్చితి తొలగిందని, స్పష్టత వచ్చిందని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. ఎస్‌బీఐ లైఫ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి 74 శాతం, బీఎన్‌పీ పారిబాకి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీఎన్‌పీ తన వాటాలను పెంచుకోవడంపై ఆసక్తిగా ఉందని, ఎంత మేర పెంచుకుంటుందో .. ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని బసు తెలిపారు. మరోవైపు, మ్యాక్స్ బూపా జేవీలో బ్రిటన్ భాగస్వామ్య సంస్థ బూపా కూడా వాటాలు పెంచుకోవాలనుకుంటోందని మ్యాక్స్ ఇండియా చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం దేశీ జీవిత బీమా రంగంలో రూ. 35,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని, ఇందులో ఎఫ్‌డీఐలు (26 శాతం పరిమితిని బట్టి చూస్తే) సుమారు రూ. 8,700 కోట్లు ఉంటాయని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ చెప్పారు. పరిమితిని పెంచడం వల్ల అదనంగా మరో రూ. 7,800 కోట్ల ఎఫ్‌డీఐలు రాగలవన్నారు.
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతం: ఈ బిల్లు ఆమోదం బీమా రంగంలో నూతన అధ్యాయానికి తెర తీసిందని ఫిక్కీ జనరల్ డెరైక్టర్ అరబింద్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. బీమా బిల్లు ఆమోదంతో దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఐఐ జనరల్ డెరైక్టర్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.