
న్యూఢిల్లీ: రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గుర్తింపు కోల్పోయిన కంపెనీలకు సంబంధించి దేశీ బ్యాంకుల్లో రూ.37,500 కోట్లు మూలుగుతున్నాయి. నీరవ్ మోదీ బ్యాంకులను ముంచిన రూ.13,000 కోట్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లు ఎక్కువ. డీమోనిటైజేషన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఆయా డొల్ల కంపెనీలు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు తెలియజేశాయి.
ఈ నిధులన్నీ కూడా పేపర్‌పై నడిచే కంపెనీల తాలూకు అక్రమ చలామణి నగదుగా (నల్లధనం) కేంద్రం భావిస్తోంది. ఎటువంటి కార్యకలాపాల్లేని 2.97 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ గతేడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తే గుర్తింపును తిరిగి పునరుద్ధరిస్తామంటూ, అప్పటి వరకు డిపాజిట్లను తిరిగి పొందే అవకాశం లేకుండా చేసింది.
అయితే, 2.97 లక్షల కంపెనీల్లో గుర్తింపు పునరుద్ధరణకు ముందుకు వచ్చినవి 60 వేల కంపెనీలేనని అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన కంపెనీలు ఆయా డిపాజిట్లు ఎలా వచ్చాయో నిరూపించుకోవాల్సి వస్తుందన్న భయంతో మిన్నకుండిపోయాయి. ‘‘2.37 లక్షల కంపెనీల లావాదేవీల సమాచారం ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులను కోరగా, ప్రైవేటు రంగ బ్యాంకులు తొలుత అయిష్టతను ప్రదర్శించాయి.
బ్యాంకింగ్ సెక్రటరీ బ్యాంకులతో సమావేశమైన తర్వాతే వాటి నుంచి సమాచారం వచ్చింది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రానున్న రోజుల్లో షెల్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ శాఖ మరో జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment