సొంతింటి కల.. తీర్చుకోండిలా | complete your's own dream house plan | Sakshi
Sakshi News home page

సొంతింటి కల.. తీర్చుకోండిలా

Published Sun, Aug 17 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

సొంతింటి కల.. తీర్చుకోండిలా

సొంతింటి కల.. తీర్చుకోండిలా

సొంతిల్లు ఉంటే నీడతో పాటు .. ఒక భరోసా కూడా వస్తుంది. హోదాకు ఒక చిహ్నంగా నిలుస్తుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం కావడంతో దీన్ని చాలామంది ఖరీదైన కలగా భావిస్తుంటారు. కాని చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికను అనుసరిస్తే సులభంగా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు తెలుసుకోవాల్సినవిషయాలపై ఈ వారం  ప్రాఫిట్ కథనం.
 
ప్రస్తుతం అనేకానేక గృహ నిర్మాణ ప్రాజెక్టులతో దేశీ హౌసింగ్ మార్కెట్ కళకళ్లాడుతోంది. వివిధ ఆదాయ వర్గాల వారి కోసం వివిధ సదుపాయాలు గల ఇళ్లు రూపొందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల దృష్టికోణం నుంచి చూస్తే, ఇల్లు కొనుక్కునేందుకు ఇది సరైన తరుణం.
 
సాధారణంగా మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటున్నవారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇంటిని ఎంపిక చేసుకోవడం నుంచి కొనుక్కునే దాకా ముందుకు వెడుతున్న కొద్దీ గందరగోళం పెరుగుతున్నట్లు ఉంటుంది. కొన్ని సార్లు వృథా ప్రయాసగానూ, కష్టసాధ్యంగాను అనిపిస్తుంటుంది. అదే రెండోసారి కొనుక్కుంటున్న వారికయితే అప్పటికే ఇంటి కొనుగోలు విషయంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి.. ఈ గందరగోళం కాస్త తక్కువగా ఉంటుంది.
 
కొనుక్కుంటున్నది మొదటిసారైనా లేదా రెండోసారైనా .. ఒక ప్రణాళిక వేసుకోవడం, ముందుచూపుతోనూ .. నిర్ణయాత్మకంగానూ వ్యవహరించగలగడం చాలా కీలకమైన విషయాలు. ఎందుకంటే.. ఇల్లనేది దీర్ఘకాలికమైన ఆస్తి. అదే సమయంలో ఆ కలను సాకారం చేసుకునేందుకు తీసుకునే గృహ రుణం అనేది దీర్ఘకాలికమైన అప్పు కూడా. అందుకే డీల్‌ని కుదుర్చుకునే ముందు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
అవేంటంటే..
 
మీతో పాటు కుటుంబసభ్యుల అవసరాలను కూడా గుర్తించాలి
ముందుగా మీకేం కావాలి, మీ కుటుంబ సభ్యుల అవసరాలేమిటి అన్నది గుర్తించాలి. మీరు ఏ వయస్సులో ఇల్లు కొనుక్కునే ప్రయత్నాన్ని ప్రారంభించారన్న దాన్ని బట్టి.. మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారన్న విషయంపై అవగాహన ఉండాలి. ఎన్ని గదులు ఉండాలి, ఏ ప్రాంతంలో తీసుకోవాలి, ఎలాటి సదుపాయాలు ఉండాలి అనుకుంటున్నారో..  ఆలోచించుకోవాలి. ఇలా ప్రాధాన్యతలను రాసుకుంటే షార్ట్‌లిస్ట్ చేసుకోవడం సులభం అవుతుంది.
 
ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి
విష్ లిస్ట్‌తో పాటు ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటివి లెక్క వేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇల్లు కొనుక్కునేందుకు ఎంత పక్కన పెట్టగలరన్న దానిపై అవగాహన వస్తుంది. ఇంటి  కల సాకారం కోసం అవసరమైతే భారీ ఖర్చులు, విలాసవంతమైన టూర్లు వగైరాలు తగ్గించుకోవాల్సి రావొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకోవడానికి ముందే దీర్ఘకాలికమైన ఇతరత్రా రుణాలేమైనా ఉంటే చెల్లించేసే ప్రయత్నం చేయాలి. మీ ఆదాయ, వ్యయాల విధానాన్ని బట్టి ఇల్లు తీసుకునేందుకు గరిష్టంగా మీకు ఎంత రుణం లభిస్తుందో లెక్కవేసుకోవడానికి కావాలంటే బ్యాంకులు సహకారం అందిస్తాయి.
 
డౌన్‌పేమెంటు కోసం దాచిపెట్టండి
ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్‌పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు యుక్తవయస్సు నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. దీనివల్ల కలల సౌధాన్ని దక్కించుకోవడం సులభమవుతుంది. హోమ్ లోన్ తీసుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచే ప్రతిపాదిత ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని ప్రతి నెలా తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టడం మంచిది.
 
దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సొంతింటి కోసం నిధి తయారవుతుంది. రెండోదేమిటంటే.. మీకొచ్చే ఆదాయంలో ప్రతిపాదిత ఈఎంఐలకు కూడా చోటు కల్పించడం సాధ్యపడుతుంది. ఈ మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, అవసరమైతే గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement