Housing construction project
-
‘రియల్’ నుంచి పేదలు ఔట్ !
ప్రైవేటు గృహ సముదాయాల్లో పేదల వాటాకు చెల్లు ♦ 25% గృహాలు/ భవనంలో 10% కేటాయించాలన్న నిబంధనలు రద్దు ♦ ‘క్రెడాయ్’ విజ్ఞప్తిపై సర్కారు సానుకూల స్పందన ♦ కొత్త భవన నిర్మాణ నియమావళికి కసరత్తు ♦ త్వరలో జీవో విడుదల సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు, రియల్టర్లు నిర్మించే గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పేదలకు సైతం వాటాలు కల్పించాలనే నిబంధనలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ప్రైవేటు హౌసింగ్ ప్రాజెక్టుల్లో బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం గల సమూహా (ఎల్ఐజీ)లకు 25 శాతం గృహాలు లేక భవనంలో 10 శాతం ప్రాంతాన్ని కేటాయించాలన్న నిబంధనలను త్వరలో ఉపసంహరించుకోనుంది. ప్రత్యామ్నాయంగా బిల్డర్లు/రియల్టర్ల నుంచి పేదల గృహ నిర్మాణ అవసరాల కోసం నివాస రుసుం (షెల్టర్ ఫీజు)ను వసూలు చేయనుంది. స్థిరాస్థి వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్) చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థిరాస్థి రంగ వ్యాపారాభివృద్ధికి అడ్డంకిగా మారిన నిబంధనలు సడలించాలని కోరుతూ ‘క్రెడాయ్’ ప్రతినిధులు గత నెల 28న సీఎం కేసీఆర్‌ను కలిశారు. భవన నిర్మాణ నియమావళిని ప్రకటిస్తూ పురపాలక శాఖ 2012లో జారీ చేసిన జీవో 168లోని కఠిన నిబంధనలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకృతం చేయాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సరళీకృత నిబంధనలతో కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మరికొన్ని రోజుల్లో జీవో రానుంది. మినహాయింపులివీ... ► గ్రూపు హౌసింగ్ ప్రాజెక్టు స్థలం విస్తీర్ణం 5 ఎకరాలకు మించితే అందులో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలకు 25 శాతం గృహాలు లేక భవనంలోని 10 శాతం ప్రాంతాన్ని బిల్డర్లు కేటాయించాలనే నిబంధనను రద్దు చేయనున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల్లోపు సైట్ల విషయంలో వసూలు చేస్తున్న షెల్టర్ ఫీజును.. 5 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సైట్లకు వర్తింపజేయనున్నారు. ► ఆకాశహర్మ్యాల నిర్మాణ ంపై ‘సిటీ లెవెల్ ఇంపాక్ట్ ఫీజు’లోనూ భారీ సడలింపులు ఇవ్వనున్నారు. చదరపు మీటర్‌కు జీహెచ్ఎంసీలో రూ.500 నుంచి 5,000, హెచ్ఎండీఏలో రూ.175 నుంచి 2,000 వరకు వివిధ స్లాబుల్లో ఈ ఫీజులను బాదుతుండగా.. ఇకపై కేవలం రెండు స్లాబుల్లో మాత్రమే వసూలు చేస్తారు. 17 అంతస్తుల వరకు ఓ స్లాబును, ఆపై మరో స్లాబును వర్తింపజేస్తారు. ► సైబరాబాద్ అభివృద్ధి ప్రాంతం (సీడీఏ)లో చదరపు మీటర్‌కు రూ.100 చొప్పున వాల్యూ అడిషన్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇకపై ఇవి ఉండవు. ► ఇక నుంచి 15 రోజుల్లో ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీ. లేకుంటే బాధ్యులపై చర్యలు. ► జీహెచ్ఎంసీ పరిధిలో సింగిల్ విండో విధానంలో భవన నిర్మాణ అనుమతులు. వివిధ శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ► గ్రూపు హౌసింగ్ పథకాల్లో అన్ని రోడ్లు, ఖాళీ స్థలాలను స్థానికపురపాలికకు గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధనను సైతం సడలించనున్నారు. కేవలం 10 శాతం ఖాళీ స్థలం గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోతుంది. అంతర్గత రోడ్లకు మినహాయింపు ఇవ్వనున్నారు. ► భవనాల్లో అదనపు నిర్మాణాల కోసం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)ను సైతం 200 నుంచి 250 శాతానికి పెంచనున్నారు. ► రోడ్డు విస్తీర్ణంలో స్థలం కోల్పోయిన వారికి భవన ముందు భాగంలో సెట్‌బ్యాక్ సడలింపులను ఇకపై జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం అవసరం ఉండదు. ► రక్షణ, రైల్వే స్థలాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు ప్రస్తుతం రక్షణ, రైల్వే శాఖల నుంచి నిరంభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తప్పనిసరి. ఈ నిబంధనను సైతం సడలించనున్నారు. ► ప్రస్తుతం మల్టిప్లెక్స్‌లపై అదనపు అంతస్తులకు అనుమతి లేదు. ఎత్తు 30 మీటర్లకు మించకూడదు. దీనిని సడలించనున్నారు. ►హెచ్ఎండీఏ/కుడా పరిధిలో భవన నిర్మాణ అనుమతులను గ్రామ పంచాయతీలతో సబంధం లేకుండా నేరుగా ఆయా సంస్థలే ఇవ్వనున్నాయి. -
సొంతింటి కల.. తీర్చుకోండిలా
సొంతిల్లు ఉంటే నీడతో పాటు .. ఒక భరోసా కూడా వస్తుంది. హోదాకు ఒక చిహ్నంగా నిలుస్తుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం కావడంతో దీన్ని చాలామంది ఖరీదైన కలగా భావిస్తుంటారు. కాని చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను అనుసరిస్తే సులభంగా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు తెలుసుకోవాల్సినవిషయాలపై ఈ వారం ప్రాఫిట్ కథనం. ప్రస్తుతం అనేకానేక గృహ నిర్మాణ ప్రాజెక్టులతో దేశీ హౌసింగ్ మార్కెట్ కళకళ్లాడుతోంది. వివిధ ఆదాయ వర్గాల వారి కోసం వివిధ సదుపాయాలు గల ఇళ్లు రూపొందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల దృష్టికోణం నుంచి చూస్తే, ఇల్లు కొనుక్కునేందుకు ఇది సరైన తరుణం. సాధారణంగా మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటున్నవారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇంటిని ఎంపిక చేసుకోవడం నుంచి కొనుక్కునే దాకా ముందుకు వెడుతున్న కొద్దీ గందరగోళం పెరుగుతున్నట్లు ఉంటుంది. కొన్ని సార్లు వృథా ప్రయాసగానూ, కష్టసాధ్యంగాను అనిపిస్తుంటుంది. అదే రెండోసారి కొనుక్కుంటున్న వారికయితే అప్పటికే ఇంటి కొనుగోలు విషయంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి.. ఈ గందరగోళం కాస్త తక్కువగా ఉంటుంది. కొనుక్కుంటున్నది మొదటిసారైనా లేదా రెండోసారైనా .. ఒక ప్రణాళిక వేసుకోవడం, ముందుచూపుతోనూ .. నిర్ణయాత్మకంగానూ వ్యవహరించగలగడం చాలా కీలకమైన విషయాలు. ఎందుకంటే.. ఇల్లనేది దీర్ఘకాలికమైన ఆస్తి. అదే సమయంలో ఆ కలను సాకారం చేసుకునేందుకు తీసుకునే గృహ రుణం అనేది దీర్ఘకాలికమైన అప్పు కూడా. అందుకే డీల్‌ని కుదుర్చుకునే ముందు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మీతో పాటు కుటుంబసభ్యుల అవసరాలను కూడా గుర్తించాలి ముందుగా మీకేం కావాలి, మీ కుటుంబ సభ్యుల అవసరాలేమిటి అన్నది గుర్తించాలి. మీరు ఏ వయస్సులో ఇల్లు కొనుక్కునే ప్రయత్నాన్ని ప్రారంభించారన్న దాన్ని బట్టి.. మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారన్న విషయంపై అవగాహన ఉండాలి. ఎన్ని గదులు ఉండాలి, ఏ ప్రాంతంలో తీసుకోవాలి, ఎలాటి సదుపాయాలు ఉండాలి అనుకుంటున్నారో.. ఆలోచించుకోవాలి. ఇలా ప్రాధాన్యతలను రాసుకుంటే షార్ట్‌లిస్ట్ చేసుకోవడం సులభం అవుతుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి విష్ లిస్ట్‌తో పాటు ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటివి లెక్క వేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇల్లు కొనుక్కునేందుకు ఎంత పక్కన పెట్టగలరన్న దానిపై అవగాహన వస్తుంది. ఇంటి కల సాకారం కోసం అవసరమైతే భారీ ఖర్చులు, విలాసవంతమైన టూర్లు వగైరాలు తగ్గించుకోవాల్సి రావొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకోవడానికి ముందే దీర్ఘకాలికమైన ఇతరత్రా రుణాలేమైనా ఉంటే చెల్లించేసే ప్రయత్నం చేయాలి. మీ ఆదాయ, వ్యయాల విధానాన్ని బట్టి ఇల్లు తీసుకునేందుకు గరిష్టంగా మీకు ఎంత రుణం లభిస్తుందో లెక్కవేసుకోవడానికి కావాలంటే బ్యాంకులు సహకారం అందిస్తాయి. డౌన్‌పేమెంటు కోసం దాచిపెట్టండి ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్‌పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు యుక్తవయస్సు నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. దీనివల్ల కలల సౌధాన్ని దక్కించుకోవడం సులభమవుతుంది. హోమ్ లోన్ తీసుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచే ప్రతిపాదిత ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని ప్రతి నెలా తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సొంతింటి కోసం నిధి తయారవుతుంది. రెండోదేమిటంటే.. మీకొచ్చే ఆదాయంలో ప్రతిపాదిత ఈఎంఐలకు కూడా చోటు కల్పించడం సాధ్యపడుతుంది. ఈ మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, అవసరమైతే గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది.