కాంటినెంటల్ కాఫీత్వరలో కొత్త బ్రాండ్‌తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు లేబుల్ విభాగంలో ప్రపంచ నంబర్-1 కాఫీ ఉత్పత్తి సంస్థ సీసీఎల్ ప్రొడక్ట్స్ రిటైల్ మార్కెట్లో పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నిమగ్నమైంది. త్వరలో రీబ్రాండ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. కాంటినెంటల్ స్పెషల్, ప్రీమియం, సుప్రీం బ్రాండ్లతో కాఫీని 2012 నవంబరు నుంచి విక్రయిస్తోంది. దేశీయంగా ఈ ఉత్పత్తులకు మంచి స్పందన ఉంది. అయితే ఈ బ్రాండ్ల పేరు పలకడంలో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు.
కొద్ది నెలల్లో రీబ్రాండ్ చేస్తామని, ఇందుకోసం ప్రముఖ ఏజెన్సీని నియమించామని చెప్పారు. రీబ్రాండింగ్ పూర్తి అయ్యాక కొత్తగా 3 రుచులను పరిచయం చేస్తామన్నారు. రిటైల్ విక్రయాల కోసం కాంటినెంటల్ కాఫీ పేరుతో అనుబంధ కంపెనీని సీసీఎల్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేసింది.
దేశీయంగా రూ.90 కోట్లు..: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రిటైల్ మార్కెట్లో సొంత బ్రాండ్, ప్రైవేట్ లేబుల్ కాఫీ విక్రయాల ద్వారా రూ.43 కోట్లు సమకూరింది. 2014-15లో రూ.70 కోట్లు ఆశిస్తున్నట్టు శ్రీశాంత్ తెలిపారు. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.717 కోట్లు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్లు ల క్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు. ‘70కిపైగా రకాల కాఫీని తయారు చేస్తున్నాం. 200 రకాలు చేయగలిగే సత్తా ఉంది. 100 దేశాలకు అత్యుత్తమ కాఫీని అందించాం. ఇప్పుడు భారత మార్కెట్లో విస్తరిస్తాం’ అని చెప్పారు.
వియత్నాం ప్లాంటు విస్తరణ..: సీసీఎల్‌కు గుంటూరు జిల్లా దుగ్గిరాల, స్విట్జర్లాండ్, వియత్నాంల్లో ప్లాంట్లున్నాయి. వియత్నాం ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 10 వేల నుంచి 20 వేల టన్నులకు చేర్చనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సామర్థ్యం పెంపుకు రూ.50 కోట్లు వెచ్చిస్తామని, ఇందుకు రెండేళ్ల సమయం పడుతుందన్నారు. ఇక ప్రీమియం వేరియంట్ అయిన ఫ్రీజ్ డ్రైడ్ కాఫీకి భారత్‌లో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. 5 వేల టన్నుల తయారీ సామర్థ్యంతో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు.