ఎయిర్‌టెల్ ఆఫర్స్ ఫ్రీ కాదా..?!
హైదరాబాద్: జియో పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి పలు టెలికాం కంపెనీలు ఉచిత ఆఫర్లతో ముందుకువచ్చాయి. ఎయిర్‌టెల్ కూడా తన వినియోగదారులకు వినూత్న ఆఫర్లను ప్రకటించింది. అందులో రూ.349 కే ఉచిత కాల్స్, రోజుకు1జీబీ డేటా, 28 రోజులపాటు అంటూ ప్రకటించింది. ఈ ఆఫర్‌కు సంబంధించి ఒక ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లు ప్రకటించినా కాల్ చార్జీల బాదుడు మాత్రం తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
ఇది పూర్తిగా ఉచితం కాదని పరిమితులకు లోబడి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్తున్నారని ఎయిర్‌టెల్ ఖాతాదారుల ఫిర్యాదు. ముఖ్యంగా అపరిమిత ఉచిత కాల్స్ అంటూ లేవు. రోజుకు 500 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు మించి ఉచితంగా మాట్లాడకునే అవకాశం లేదు... నాలుగు వారాలకు 4800 నిమిషాలు మాత్రమే... రోజుకు 5గంటలు(300 నిమిషాలు) మించి మాట్లాడటానికి వీలులేదు. ఒక వేళ 5గంటలు మించి మాట్లాడితే నిమిషానికి 30పైసలు చార్జీలు తప్పదని కస్టమర్ కేర్ నుంచి సమాధానం వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
అలాగే వారానికి 1200 నిమిషాలు మించి మాట్లాడినా నిమిషానికి 30 పైసలు అదనపు చార్జీలు వసూలు చేస్తారట. నెలకు 28 జీబీలో రోజుకు 1జీబీ చొప్పున వాడుకోవాల్సిఉంటుంది. ఇందులోకూడా రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకూ 500ఎంబీ, ఉదయం 6గంటలనుంచి రాత్రి 12 గంటల వరకూ 500ఎంబీ వాడుకోవాలి. ఈవిషయాలన్నీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తేనే చెప్పడం విశేషం.
కాగా టారిఫ్ ప్లాన్‌లపై ఖాతాదారులు చేస్తున్న ఆరోపణలపై ఎయిర్‌టెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.