వచ్చే నెలలో మోతెక్కనున్న ధరలు
వచ్చే నెలలో మోతెక్కనున్న ధరలు
Published Wed, Aug 16 2017 3:19 PM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM
న్యూఢిల్లీ : ధరలు వచ్చే నెలల్లో మరింత మోతకెక్కనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. జూలై నెలలో ఒక్కసారిగా పైకి ఎగిసిన రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం, వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. ఈ అప్‌ట్రెండ్ ఇలానే కొనసాగనుందని పేర్కొంది. దీంతో గత పాలసీ రివ్యూలో చేపట్టిన ద్రవ్య సడలింపు సన్నగిల్లనుందని చెప్పింది. జూలై నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ పైకి ఎగిసిందని, ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2017 జూన్‌లో 0.90 శాతంగా ఉన్న హోల్ సేల్ ద్రవ్యోల్బణం, ఒక్కసారిగా జూలై నెలలో 1.88 శాతానికి పెరిగింది. ఫుడ్ ఆర్టికల్స్ ముఖ్యంగా కూరగాయలు పెరుగుదల దీనికి దోహదం చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఈ నెలలో 2.36 శాతానికి జంప్ చేసింది. చక్కెర, పాన్, టుబాకో, మత్తుపదార్థాల ధరలు ఎగియడంతో, ఈ ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభమైంది.
ఆగస్టు నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు 3.0 శాతం, 2.1 శాతానికి పెరుగుతాయని అంచనావేస్తున్నట్టు, ఆహార ధరలు, గ్లోబల్ కమోడిటీ ధరల్లో ప్రస్తుత ట్రెండ్‌లతో ఈ పెరుగుదలను చూడొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గిందని కీలక రెపో రేటులో 25 బేసిస్‌పాయింట్లు కోత పెట్టిన ఆర్బీఐ, మరోసారి రేటు కోతను చేపట్టకపోవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. ఆక్టోబర్ సమావేశంలో రేట్లను యథాతథంగా ఉంచుతూ వెయిట్ అండ్ వాచ్ పాలసీని ఎంపీసీ అవలంభిస్తుందని తెలిపింది. ఒకవేళ రేట్లను తగ్గించాలంటే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు మరింత తగ్గాలని పేర్కొంది.
Advertisement
Advertisement