
న్యూఢిల్లీ: ప్రస్తుత ఉద్యోగిత రేటును కొనసాగించాలంటే భారత్ ఏటా కనీసం 81 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతం మేర ఉండొచ్చని పేర్కొంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఇది 7.5 శాతానికి పెరగగలదని తెలిపింది. దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులపై ఏటా రెండు సార్లు విడుదల చేసే నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది.
’ఉద్యోగాల కల్పన లేని వృద్ధి’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో.. భారత్‌లో రికవరీ తోడ్పాటుతో.. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా తన హోదాను నిలబెట్టుకున్నట్లు వివరించింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలై 1న ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్నుల విధానం ప్రభావాల నుంచి భారత్ కోలుకుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
2017లో 6.7 శాతం స్థాయిలో ఉన్న వృద్ధి రేటు 2018 నాటికి 7.3 శాతానికి వృద్ధి చెందగలదని, ఆ తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు.. వినియోగం కూడా రికవర్ కావడం ద్వారా స్థిర స్థాయిలో కొనసాగగలదని వివరించింది. ప్రపంచ దేశాల వృద్ధి రికవరీ ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవాలని, ఇందుకోసం పెట్టుబడులు.. ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment