న్యూయార్క్: ఐఫోన్ యూజర్లు ‘ఆపిల్ కార్డ్’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. వాలెట్ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్ శాక్స్ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్–అప్స్‌ను పెంచడం ద్వారా కార్డు సేవలను విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది.
సాధ్యమైనంత వరకు ఫీజుల భారాన్ని తగ్గించివేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆపిల్ పే యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్ క్రెడిట్ కార్డు వినియోగంపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. కార్డు ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు ఉందని, యూజర్లు ఫిజికల్ కార్డు కావాలని కోరితే కొంత రుసుము వసూలుచేసి కార్డును ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. వెబ్‌సైట్ ఆప్షన్ లేదని స్పష్టంచేసింది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే డిజిటల్ కార్డును ఐఫోన్ యూజర్లకు అందించనున్నామని ఈ ఏడాది మార్చిలోనే కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment