లండన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వీసా, మాస్టర్‌కార్డ్, పేపాల్, ఉబెర్ వంటి డజను పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో పాటు ఈ కంపెనీలు ఒక్కొక్కటి కనీసం 10 మిలియన్ డాలర్లు ఈ కన్సార్షియంలో ఇన్వెస్ట్ చేస్తాయి. సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ వంటివి) సామాన్యులు భారీగా నష్టపోయే ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫేస్‌బుక్ నుంచి క్రిప్టోకరెన్సీ వస్తోందన్న వార్తల నేపథ్యంలో బిట్‌కాయిన్ రేటు గణనీయంగా పెరిగింది. 2018 మే తర్వా త తొలిసారిగా 9,000 డాలర్ల స్థాయి పైకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment