టాటాలపై మిస్త్రీ అప్పీలు | Cyrus Mistry appeals against NCLT rejecting waiver plea in Tata case | Sakshi
Sakshi News home page

టాటాలపై మిస్త్రీ అప్పీలు

Published Sat, Apr 22 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

టాటాలపై మిస్త్రీ అప్పీలు

టాటాలపై మిస్త్రీ అప్పీలు

► పిటిషన్‌కు వీలు కల్పించాలని అభ్యర్థన 
► దిగువ ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల సవాలు  


న్యూఢిల్లీ: టాటా సన్స్‌లో అవకతవకలపై పిటిషన్‌కు వీలు కల్పించాలని, ఇందుకు సంబంధించి అర్హత నిబంధనలను సడలించాలని కోరుతూ టాటా సన్స్‌ బహిష్కృత  చైర్మన్‌ మిస్త్రీ శుక్రవారం నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, ఆయన ఎన్‌సీఎల్‌ఏటీలో ఈ అప్పీల్‌ దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే... టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్‌ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ నాలుగురోజుల క్రితం తోసిపుచ్చింది. కంపెనీల చట్టం  నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.  టాటా సన్స్‌ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్‌ చేస్తూ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ సంస్థలు రెండు .. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి.

టాటా సన్స్‌లో నిర్వహణ లోపాలున్నాయని,   మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేసేందుకు సంబంధించి పిటిషనర్‌కు ఇష్యూడ్‌ షేర్‌ క్యాపిటల్‌లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్‌హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్‌ క్యాపిటల్‌ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్‌ షేర్‌ క్యాపిటల్‌లో పిటిషనర్‌ సంస్థలకు కేవలం 2.17 శాతం వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్‌ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాల కోణంలో పిటి షన్‌ సాధ్యపడదని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ స్పష్టం చేసింది. చైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ వచ్చేవారం మిస్త్రీ అప్పిలేట్‌ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement