అందరికన్నా ముందుండాలి
♦ చురుగ్గా అవకాశాలు అందిపుచ్చుకోవాలి
♦ గ్రూప్ సంస్థల ఉద్యోగులకు
♦ టాటా’ చైర్మన్ సైరస్ మిస్త్రీ లేఖ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మార్కెట్ లీడరుగా స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రూప్ కంపెనీలు సంస్థాగతంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత చురుగ్గా వ్యవహరించాలని చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించారు. అమెరికాలో రికవరీ, ఆసియా.. ఆఫ్రికా ఖండాల్లో వృద్ధి మెరుగుపడుతుండటం, చైనా ఎకానమీలో మార్పులు చోటు చేసుకుంటుండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల్లోని దాదాపు ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
వ్యాపార అవకాశాలను నిరంతరం దక్కించుకోవాలంటే టాటా కంపెనీలన్నీ కొంగొత్త టెక్నాలజీలను (ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో) అందిపుచ్చుకోవాలని, వివిధ విభాగాల మధ్య వ్యత్యాసాలు తగ్గించి మరింత సమష్టిగా కృషి చేయాలని మిస్త్రీ సూచించారు. చైనా ఎకానమీలో చోటు చేసుకుంటున్న మార్పులు పలు దేశాలపై ప్రభావాలు చూపుతున్నాయని, ఈ క్రమంలో తెరపైకి వచ్చే కొత్త వ్యాపారావకాశాలను గుర్తించి, దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
రాబోయే సంవత్సర కాలం గ్రూప్ కంపెనీల శక్తిసామర్థ్యాలను పరీక్షించేదిగాను, అదే సమయంలో కొత్త వ్యాపార మార్గాలను చూపించేదిగా ఉండబోతోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వ స్థాయిని నిలబెట్టుకోవాలంటే గ్రూప్ కంపెనీలు వ్యూహాత్మకంగానూ, సంస్థాగతంగానూ చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వివిధ దేశాల్లో కార్యకలాపాలు ఉన్న గ్రూప్ కంపెనీలు.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఇతోధికంగా తోడ్పాటు అందించాలని సూచించారు.