మిస్త్రీకి 'టాటా' | Cyrus Mistry removed as Tata Sons chairman, Ratan Tata returns as interim chief | Sakshi
Sakshi News home page

మిస్త్రీకి 'టాటా'

Published Tue, Oct 25 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

మిస్త్రీకి 'టాటా'

మిస్త్రీకి 'టాటా'

చైర్మన్ పదవి నుంచి ఉన్నపళంగా ఉద్వాసన..
టాటా సన్స్ బోర్డు సమావేశంలో అనూహ్య నిర్ణయం 
తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ రతన్ టాటా
కొత్త చైర్మన్ ఎంపికకు ఐదుగురితో అన్వేషణ కమిటీ  
నాలుగు నెలల్లోగా నియమించాలని గడువు
మిస్త్రీ తొలగింపుపై పల్లోంజీ గ్రూప్ న్యాయపోరాటం!

టాటా వ్యాపార సామ్రాజ్యంలో కలకలం...
దేశీ కార్పొరేట్ రంగంలో ఎవరూ ఊహించని షాకింగ్ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీని చడీ చప్పుడు కాకుండా... అర్ధంతరంగా పదవి నుంచి తొలగించారు. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీకి... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికారు. టాటాల చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు. దీంతో మిస్త్రీ ఉద్వాసనకు కారణాలేంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

పదవీ విరమణ చేసి పక్కకు తప్పుకున్న రతన్ టాటానే మళ్లీ టాటా సన్స్ బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా నియమించడంతో... మిస్త్రీ పనితీరుపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. నిజానికి టాటా సన్స్‌లో ఏకైక అతిపెద్ద వాటాదారు పల్లోంజీ గ్రూపే. ఆ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కుమారుడైన సైరస్ మిస్త్రీని ఈ రకంగా తొలగించడంతో... దీనిపై పల్లోంజీ గ్రూపు న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

ముంబై: మామూలు ఉద్యోగికైనా ముందు చెప్పటమో, తొలగించే ముందు నోటీసివ్వటమో చేస్తారు. ఇక అత్యున్నత స్థాయి ఉద్యోగులకైతే వారంతట వారు గౌరవంగా తప్పుకోవటానికి ఏ సంస్థయినా అవకాశమిస్తుంది. అలాంటిది... దేశంలో అత్యంత విశ్వసనీయమైనదిగా భావించే నంబర్ వన్ గ్రూపు టాటా... తన చైర్మన్ సైరస్ మిస్త్రీని అత్యంత అగౌరవమైన రీతిలో తొలగించింది. సోమవారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసే వరకూ అంతా ప్రశాంతంగా ఉన్నా... సాయంత్రం మాత్రం టాటా గ్రూపు పిడుగులాంటి ప్రకటనను వెలువరించింది. టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు సమావేశం కావటం... మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తక్షణం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం వెనువెంటనే జరిగిపోయాయి.

అంతేకాదు!! ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ 78 ఏళ్ల రతన్ టాటాయే ఉంటారని, కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయటానికి ఐదుగురు సభ్యులతో కూడిన అన్వేషణ కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రతన్ టాటా కూడా సభ్యుడిగా ఉన్న ఈ కమిటీకి... కొత్త చైర్మ న్‌ను ఎంపిక చేసేందుకు నాలుగు నెలల గడువు కూడా విధించారు. కమిటీలో టీవీఎస్ గ్రూప్ అధిపతి వేణు శ్రీనివాసన్, బెయిన్ క్యాపిటల్‌కు చెందిన అమిత్ చంద్ర, మాజీ దౌత్యవేత్త రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య (బ్రిటన్ చట్టసభలో మెంబర్) సభ్యులుగా ఉంటారని టాటా సన్స్ వివరించింది. ఇందులో భట్టాచార్య తప్ప మిగిలిన వారంతా టాటా సన్స్‌లో డెరైక్టర్లే. మరోవంక... గ్రూపులోని కంపెనీలకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ), మేనేజింగ్ డెరైక్టర్ల(ఎండీ)కు సంబంధించి ఎలాంటి మార్పులూ చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో మిస్త్రీని ఎంపిక చేసిన కమిటీలో కూడా భట్టాచార్య ఉన్నారు. అప్పట్లో మిస్త్రీని ‘చురుకైన, నిస్వార్థమైన’ వ్యక్తిగా అభివర్ణించారు.

 నాలుగేళ్లకే అసంతృప్తి...
టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌కు చైర్మన్‌గా మిస్త్రీని ఎంపిక చేసే ప్రక్రియ 2011 నవంబర్‌లో పూర్తయింది. అనంతరం ఆయన డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతక్రితం 2006లో ఆయన బోర్డులో డెరైక్టర్‌గా చేశారు. 75 ఏళ్లకు (2012, డిసెంబర్ 29) తాను పదవీ విరమణ చేస్తానని రతన్ టాటా ప్రకటించడంతో కొత్త చైర్మన్ ఎంపిక కోసం అప్పట్లోనూ ఐదుగురు సభ్యుల అన్వేషణ కమిటీని ఏర్పాటు చేశారు.

సుమారు రెండేళ్లపాటు సరైన వ్యక్తి కోసం అన్వేషించిన కమిటీ... చివరకు టాటా సన్స్‌లో అత్యధిక వాటాదారు (దాదాపు 18.4 శాతం వాటా) అయిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన 48 ఏళ్ల సైరస్ మిస్త్రీని ఎంపిక చేసింది. 2012 డిసెంబర్‌లో మిస్త్రీకి టాటా గ్రూపు సారథ్య బాధ్యతలు అప్పగించారు. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమారుడే సైరస్ మిస్త్రీ. మరోపక్క, టాటాలతో కూడా మిస్త్రీలకు బంధుత్వం ఉంది. మిస్త్రీ సోదరి అలూను... రతన్ టాటాకు వరుసకు సోదరుడైన నోయల్ టాటా పెళ్లాడారు. రతన్ స్థానంలో చైర్మన్ రేసులో నోయల్ టాటా పేరు కూడా అప్పట్లో ప్రముఖంగా వినిపించడం గమనార్హం.

ట్రస్ట్‌ల సూచనల మేరకే...
మిస్త్రీని ఇంత అర్ధంతరంగా తొలగించడానికి కారణాలేంటన్నది టాటా సన్స్ బోర్డు వెల్లడించలేదు. అయితే టాటా ట్రస్ట్స్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది స్పష్టం. ‘టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిరక్షించడం కోసం, సారథ్యం మార్పుతో పాటు మరింత సమర్థవంతమైన వ్యక్తిని నియమించాలి’ అని టాటాట్రస్ట్స్ సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ప్రధాన వాటాదారు(టాటా ట్రస్ట్స్) సూచనల మేరకు టాటా సన్స్, గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే డెరైక్టర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది’ అని గ్రూప్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేయడం దీనికి నిదర్శనం.

టాటా గ్రూప్‌లో 29 లిస్టెడ్ కంపెనీలు, మరో 70కి పైగా అన్‌లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. అన్నీ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ వాటన్నిటికీ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ సంస్థే. ఇక టాటా సన్స్‌లో దాదాపు 66% టాటా కుటుంబ సభ్యుల నేతృత్వంలోని ట్రస్టుల చేతిలోనే ఉంది. సామాజిక, ధార్మిక కార్యకలాపాలను నిర్వహించే ఈ ట్రస్టుల్లో అతిపెద్దవి సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్. ఈ రెండింటికీ చైర్మన్ రతన్ టాటాయే. టాటా సన్స్‌కు చైర్మన్ ఎంపిక, తొలగింపు అధికారాలు ఈ ట్రస్టుకే అధికంగా ఉన్నాయి.  అందుకే మిస్త్రీని తొలగించే నిర్ణయానికి కూడా టాటా సన్స్‌లోని 9 మంది డెరైక్టర్లలో ఆరుగురు మద్దతు తెలిపారని, ఇద్దరు సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. మిగిలిన తొమ్మిదో వ్యక్తి మిస్త్రీ కావచ్చు.

అయితే కోర్టు నుంచి పల్లోంజీ గ్రూప్ ఎటువంటి ముందస్తూ ఉత్తర్వ్యూ పొందకుండా టాటా గ్రూప్ తక్షణం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనుందని సమాచారం. దీనిప్రకారం, తాజా పరిణామంపై తొలుత టాటా గ్రూప్ వాదనలను విన్నాకే కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు, ప్రధానికి రతన్ లేఖ...
సైరస్ మిస్త్రీ తొలగింపు... తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా ఈ మొత్తం ఉదంతంపై గ్రూప్ కంపెనీల ఉద్యోగులకు లేఖ రాశారు. ‘టాటా గ్రూప్ వ్యాపారాలకు తగిన స్థిరత్వాన్ని భరోసాను కల్పించేందుకే నేను తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించా. యాజమాన్యపరంగా నిర్వహణ బాధ్యతల్లో మార్పు చేర్పులను త్వరలో ప్రకటిస్తా. అదేవిధంగా కొత్త చైర్మన్‌ను గుర్తించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం’ అని రతన్ టాటా లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్రమోదీకి కూడా రతన్ టాటా ఒక లేఖ రాశారు. తక్షణం అమల్లోకి వచ్చే విధంగా  చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని  టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డ్ తొలగించిందని తెలిపారు. అలాగే కొత్త చైర్మన్ గుర్తింపునకు సంబంధించి ఒక నియామక కమిటీ కూడా ఏర్పాటయినట్లు లేఖలో వివరించారు.

రతన్‌కు ఉన్న స్పీడ్ లేదా..?
జేఆర్‌డీ టాటా నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రతన్‌టాటా రెండు దశాబ్దాల్లో... టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని వటవృక్షంగా విస్తరించడంలో తన సత్తా ఏంటో చాటిచెప్పారు. బాధ్యతలు స్వీకరించినప్పుడు 1991లో గ్రూప్ కంపెనీల మొత్తం టర్నోవర్ రూ.10,000 కోట్లు కాగా.. దీన్ని 2011-12 నాటికి 100.9 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు) చేర్చగలిగారు. ఇదంతా రతన్ హయాంలో జరిగిందే. అంతేకాదు.. విదేశీ కంపెనీలను చేజిక్కించుకోవడంలో కూడా ఆయన దూకుడు అంతా ఇంతాకాదు. ఇందులో ఒకట్రెండు మినహా అన్నీ గ్రూపునకు మరింత విలువను చేకూర్చినవే.

అన్నింటికంటే ముఖ్యంగా 2008లో జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)ను 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేయడం ఆయన సాహసానికి నిదర్శనం. ఇప్పుడు టాటా మోటార్స్ దేశీయంగా చతికిలపడినప్పటికీ.. కంపెనీకి ప్రధాన ఆదాయవనరుగా జేఎల్‌ఆర్ ఆదుకుంటుండటం విశేషం. 2000లో బ్రిటిష్ కంపెనీ టెట్లేను 45 కోట్ల డాలర్లకు దక్కించుకోవడం కూడా రతన్ ఘనతే. అయితే, 2007లో టాటాస్టీల్ కొనుగోలు చేసిన ఆంగ్లోడచ్ స్టీల్ కంపెనీ కోరస్ విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. అయితే, నిర్ణయాలు తీసుకోవడంలో రతన్ మార్కు వేగం... నైపుణ్యం, ముందుచూపు మిస్త్రీలో కొరవడ్డాయనే విమర్శలున్నాయి. మిస్త్రీ సారథ్యం చేపట్టాక టాటా గ్రూప్‌లో చెప్పుకోతగిన భారీ కొనుగోళ్లుకానీ, నిర్ణయాలుకానీ వెలువడకపోవడాన్ని పరిశీలకులు కారణంగా చూపిస్తున్నారు.

టాటాల సంపద సృష్టికర్త...
టాటా గ్రూపు కంపెనీలకు విలువను సృష్టించడంలో రతన్ టాటాకు ఆమడ దూరంలో సైరస్ మిస్త్రీ నిలిచారు. కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధి నాలుగేళ్ల సైరస్ మిస్త్రీ హయాంలో రెట్టింపు కాగా...రెండు దశాబ్దాల రతన్ టాటా కాలంలో 57 రెట్లు వృద్ధి చెందింది.

ప్రస్తుతం గ్రూపు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) 125 బిలియన్ డాలర్లు (రూ.8.5 లక్షల కోట్లు). 2012లో సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టేనాటికి ఇది రూ.4.6 లక్షల కోట్లుగానే ఉంది.

ప్రస్తుతం ఒక్క టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషనే రూ.4.8 లక్షల కోట్లు. 

రతన్ టాటా టాటా గ్రూపు చైర్మన్‌గా 1991లో బాధ్యతలు చేపట్టేనాటికి గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.8,000 కోట్లు. మిస్త్రీకి బాధ్యతలు ఇచ్చే నాటికి అది రూ.4.62 లక్షల కోట్లు అయింది.

రతన్ బాధ్యతలు చేపట్టే నాటికి గ్రూపులోని 18 లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్ అధిక విలువ గల కంపెనీ.

మిస్త్రీ బాధ్యతలు చేపట్టే సమయానికి టీసీఎస్ అధిక విలువ కలిగిన కంపెనీగా అవతరించింది.

టాటా గ్రూపు కంపెనీలకు సుమారు 41 లక్షల షేర్ హోల్డర్లు ఉన్నారు.

టాటా ఒక్కరే కాదు..అలా ఇంకొందరు ఉన్నారు..
ఎవరూ ఊహించని విధంగా టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ రతన్ టాటా నియమితులుకావడం ఆశ్చర్యకరమే. ఈయన మాదిరి గానే ఒకసారి కంపెనీ బాధ్యతల నుంచి నిష్ర్కమించి.. కొన్ని అవసరాల రీత్యా మళ్లీ అదే కంపెనీ పగ్గాలు చేపట్టిన  వారు కొందరున్నారు. వారెవరో ఒకసారి చూద్దాం..

రతన్ టాటా
రతన్ టాటా తన 75 ఏళ్ల వయసులో 2012 డిసెంబర్‌లో టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు తాజాగా మళ్లీ కంపెనీ తాత్కాలిక చైర్మన్‌గా నియమితుల య్యారు.

ఎన్.ఆర్.నారాయణ మూర్తి
ఎన్.ఆర్.నారాయణ మూర్తి 2011లో ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పుడు ఈయన స్థానంలో కె.వి.కామత్ నియమితులయ్యారు. కానీ 2013 జూన్‌లో మళ్లీ నారాయణ మూర్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డెరైక్టర్‌గా మరోమారు బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు.

మైకెల్ డెల్
మైకెల్ డెల్ 2004 మార్చిలో డెల్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. కానీ మళ్లీ 2007 జనవరిలో బోర్డు సభ్యుల నిర్ణయం మేరకు మళ్లీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. డెల్ కంపెనీని స్థాపించింది ఈయనే.

దివంగత స్టీవ్ జాబ్స్
యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. ఈయన యాపిల్ కంపెనీ నుంచి 1985 సెప్టెంబర్‌లో బయటకు వచ్చారు. కానీ 1997 జూలైలో కంపెనీ తాత్కాలిక సీఈవోగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు నష్టాల వైపు అడుగులేస్తోన్న కంపెనీని మళ్లీ వృద్ధి బాటలో పయనింపజేశారు.

హోవర్డ్ షెల్ట్
స్టార్ బక్స్‌ను ప్రపంచ స్థాయి కంపెనీగా మార్చిన తర్వాత హోవర్డ్ షెల్ట్ 2000లో కంపెనీ బాధ్యతలకు గుడ్‌బై చెప్పారు. కానీ తర్వాత ఈయన కంపెనీ తన మూలాల నుంచి దూరంగా వెళ్లుతోందని భావించి మళ్లీ 2008 ఆగస్ట్‌లో కంపెనీ పగ్గాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement