మిస్త్రీ... ‘టాటా’ చెప్పేశారు!
• టాటా గ్రూప్‌లో 6 కీలక సంస్థల బోర్డు పదవులకు రాజీనామా
• రతన్ టాటా కుట్ర చేశారని ఆరోపణ
• మరో వేదిక నుంచి పోరాటం చేస్తానని ప్రకటన
ముంబై: దాదాపు ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్‌కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ .. తన పోరును మరింత పెద్ద వేదిక నుంచి కొనసాగిస్తానని ప్రకటించారు. అసాధారణ సర్వసభ్య సమావేశాల వేదికల నుంచి దూరంగా వెళ్లగలిగితేనే.. సంస్కరణల అమలు, ఉద్యోగులు.. షేర్‌హోల్డర్లు, ఇతర వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాల సాధనకు సమర్ధంగా పనిచేయడం సాధ్యపడుతుందనితాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రెండు పేజీల ప్రకటన, రికార్డు చేసిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా హయాంలో .. ఎయిర్‌ఏషియాకు మరిన్ని నిధులు విడుదలచేయడం తదితర వివాదాస్పద డీల్స్ విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా తప్పించిన మిస్త్రీని బోర్డు పదవి నుంచి కూడా తొలగించే ప్రతిపాదనతో పలు టాటా గ్రూప్ కంపెనీలు వరుసగా అసాధారణసర్వ సభ్య సమావేశాలు (ఈజీఎంలు) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ సంస్థలు ఆయన తొలగింపునకు ఆమోదముద్ర వేశాయి.
ప్రక్షాళనకు పోరు కొనసాగిస్తా..: గవర్నెన్స్‌ను ప్రక్షాళన చేసేందుకు, కోల్పోయిన నైతిక ప్రమాణాలను పునరుద్ధరించేందుకు చేపట్టిన ఉద్యమంగా తన పోరును అభివర్ణించారు మిస్త్రీ. టాటా గ్రూప్ ప్రయోజనాలనుకాపాడేందుకు వేగగతిని, గేరును మార్చాల్సిన సమయం వచ్చిందని.. ప్రతి అంశాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. అందుకే న్యాయం, చట్టం తూచా తప్పకుండా అమలయ్యే మరింత పెద్దవేదిక నుంచి పోరు కొనసాగించాలని నిర్ణయించుకున్నానని మిస్త్రీ పేర్కొన్నారు. టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిరక్షించే విధంగానే తాను వ్యవహరిస్తున్నానని ఆయన చెప్పారు.
వేదిక విషయంలో మిస్త్రీపూర్తిగా వివరణ ఇవ్వకపోయినప్పటికీ .. తన తొలగింపును సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించే ఆలోచన ఆయనకు ఉండి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తనంత తానుగా పక్కకుతప్పుకోవడం ద్వారా.. ఈ పోరు హోదా కోసం కాదు.. టాటా గ్రూప్ చిరకాలం వృద్ధి చెందేలా దీర్ఘకాలిక సంస్కరణల అమలు కోసమేనని తెలియజేయదల్చుకున్నట్లు మిస్త్రీ చెప్పారు. తనకు మద్దతుగా నిల్చినషేర్‌హోల్డర్లకు ధన్యవాదాలు తెలిపిన మిస్త్రీ.. సరైన చర్యలు తీసుకునేలా యాజమాన్యాన్ని ప్రశ్నించడం కొనసాగించాలని కోరారు.
వ్యూహాత్మకంగానే మిస్త్రీ రాజీనామా: టాటా సన్స్
మెజారిటీ వాటాదారులు తనకు మద్దతుగా లేరన్నది గుర్తించే మిస్త్రీ రాజీనామా చేశారని, ఇది బాగా ఆలోచించుకుని అమలు చేసిన వ్యూహమని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. మిస్త్రీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారం,విషపూరితమైనవని పేర్కొంది. వీటన్నింటికి తగు విధంగా జవాబు చెబుతామని తెలిపింది. మరోవైపు, టాటా సంస్థల నుంచి డైరెక్టర్‌గా మిస్త్రీ తప్పుకున్నప్పటికీ .. టాటాపై పోరు విషయంలో వెనక్కి తగ్గే యోచనేదీ నుస్లీవాడియాకి లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అంతా ఆయనే చేశారు...
టాటా సన్స్ నుంచి తనను తొలగించిన తర్వాత రతన్ టాటా మళ్లీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడాన్ని మిస్త్రీ అక్రమ కుట్రగా అభివర్ణించారు. ’అక్టోబర్ 24నాటి అక్రమ కుట్రకు రతన్ టాటా తగు కారణాలుచూపుతారేమోనని ఎదురుచూస్తూ ఇప్పటికి 8 వారాలు గడిచిపోయింది. ఇంతవరకూ ఒక్కటీ కనిపించలేదు’ టాటా ట్రస్ట్‌కి చెందిన ట్రస్టీల చర్యల కారణంగా టాటా సన్స్‌లో గవర్నెన్స్ ఏ విధంగా దెబ్బతిన్నదీ తానుపత్రాలతో సహా షేర్‌హోల్డర్ల ముందు ఉంచానని చెప్పారు. ’ఇటీవలి వారాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉన్న వారు వ్యవహరించిన తీరు నైతిక ప్రమాణాల విషయంలో వారి ముసుగును తొలగించాయి’ అన్నారు.