‘టాటా’పై సంధి లేదు.. సమరమే!
గ్రూప్‌లో వాటాలు వదులుకోం: బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ
• నిర్వహణా లోపాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
ముంబై: రతన్ టాటాతో రాజీపడే ప్రసక్తేలేదని.. గ్రూప్ కంపెనీల్లో నిర్వహణా లోపాలపై తన పోరాటం కొనసాగుతుందని సైరస్ మిస్త్రీ తేల్చిచెప్పారు. గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తనను తొలగించడంపై టాటా సన్స్‌తో న్యాయ పోరాటానికి దిగిన మిస్త్రీ.. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ దిగ్గజం వరకూ ఎదిగిన 149 సంవత్సరాల గ్రూప్‌కు టాటా కుటుంబ యేతర చైర్మన్‌గా మొట్టమొదటిసారి బాధ్యతలు చేపట్టి, అనూహ్య పరిస్థితిల్లో ఈ బాధ్యతలను కోల్పోయిన మిస్త్రీ ఆయా అంశాలకు సంబంధించి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో కొన్ని ముఖ్యాంశాలు ...
⇔ 103 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన గ్రూప్‌లో దాదాపు 18.5%గా మా హోల్డింగ్‌ను వదులుకోకుండా, గ్రూప్‌లో నిర్వహణా పరమైన సవ్యతలకోసం నా పోరాటం కొనసాగుతుంది.
⇔ పోరు విస్తృత స్థాయిలో ఉంటుంది. ఒకవేళ న్యాయపోరాటంలో ఓడిపోయినా... గ్రూప్ నుంచి మా కుటుంబ వాటాల ఉపసంహరణ జరగదు.
⇔ గ్రూప్‌లో నిర్వహణ, సంస్కరణల గురించే నేను పోరాడాను. పోరాడతాను. ఒకటి, రెండు రోజులుకాదు... 50 సంవత్సరాల నుంచీ మేము అక్కడ ఉన్నాము. నిర్వహణ మెరుగుపడితే అంతా మంచే జరుగుతుంది.
⇔ ఇప్పుడు జరుగుతోంది బిజినెస్ గ్రూప్ పోరాటం కాదు. అలాంటి తరహా పరిస్థితి ఇక్కడ తలెత్తలేదు. అదే అయితే నేను అక్కడ (బోర్డులో) కూర్చోవడానికే ఇష్టపడేవాడిని. వ్యాపార అంశాలకు సంబంధించినది కాదుకాబట్టే నేను అక్కడి నుంచి నాకునేనుగా తప్పుకున్నాను.
⇔ నన్ను చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించడం నిర్వహణ లోపాన్ని, విలువలు తగ్గడాన్ని సూచిస్తోంది. టాటాల నిర్వహణకు సంబంధించి ఒక మార్పు స్థితిలో గ్రూప్ ఉంది. వ్యాపారాలకు భవిష్యత్ రక్షణ అవసరం. ఇందుకు వ్యవస్థాగతమైన ప్రక్రియ ప్రారంభంకాక తప్పదు. లేదంటే వాణిజ్య ప్రయోజనాలు కిందకు జారే అవకాశం ఉంది.
⇔ ట్రస్టులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉంటే, నిర్వహణ కూడా గాడి తప్పుతుంది. అలాంటప్పుడు కంపెనీల పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి ధోరణి దీర్ఘకాలంలో కంపెనీ ప్రయోజనాలకు తగింది కాదు.
⇔ నా చర్యల వల్ల గ్రూప్ విలువ పడిపోతోందన్న ఇన్వెస్టర్లు కొందరు ఆందోళనగా ఉన్న విషయం వాస్తవమే. అయితే అసలు నిజం ఏమిటన్న విషయం తెలుసుకోడానికి కొంత సమయం పడుతుంది. దీర్ఘకాలంలో జరిగే మంచి ఫలితం కోసం తగిన కృషి చేయడం ఎప్పుడూ అవసరమే.
⇔ నిర్వహణ పరమైన అంశాలకు సంబంధించి ఎంతో చర్చ జరుగుతోంది. టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డు, ఆపరేటింగ్ కంపెనీల బోర్డుల విషయంలో ఎంత కార్పొరేట్ గవర్నెర్స్ ఉందన్న అంశం నన్ను చైర్మన్‌గా తొలగించడానికి ఉద్దేశించి, నాడు టేబుల్‌లో ఉంచిన ఒక ముసాయిదా తెలియజేస్తోంది.
న్యాయపోరాటం షురూ..
• నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్
• రేపు విచారణ జరిగే అవకాశం
ముంబై: ఆరు టాటా లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచీ తనకుతానుగా తప్పుకున్న మరుసటి రోజే టాటా సన్స్‌పై సైరెస్ మిస్త్రీ న్యాయ పోరాటం ప్రారంభించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. టాటా సన్స్‌పై ఇక్కడి ఎన్‌సీఎల్‌టీలో మిస్త్రీ నియంత్రిత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు తాజా పిటిషన్‌ను దాఖలు చేసినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం– కంపెనీ చట్టంలోని 241వ సెక్షన్ కింద టాటా సన్స్‌కు వ్యతిరేకంగా అణచివేత, నిర్వహణా లోపాల ఆరోపణలతో ఈ పిటిషన్ దాఖలయ్యింది.
ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 22న జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూప్ సంస్థల బోర్డులకు రాజీనామా చేస్తూనే రతన్ టాటాపై ఆయన పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. తన పోరాటాన్ని మరింత విస్తృత వేదికకు తీసుకువెళ్లనున్నట్లూ తెలిపారు. అసాధారణ సర్వ సభ్య సమావేశాల వేదికల నుంచి దూరంగా వెళ్లగలిగితేనే.. సంస్కరణల అమలు, ఉద్యోగులు.. షేర్‌హోల్డర్లు, ఇతర వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాల సాధనకు సమర్ధంగా పనిచేయడం సాధ్యపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.