
సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట
మైనార్టీ షేర్‌హోల్డర్ల కేసు విచారణకు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశం
న్యూఢిల్లీ: చైర్మన్ హోదా నుంచి తనను అర్ధంతరంగా తొలగించిన టాటా గ్రూప్‌పై న్యాయపోరాటం చేస్తున్న సైరస్ మిస్త్రీకి తాజాగా ఎన్‌సీఎల్‌ఏటీలో స్వల్ప ఊరట లభించింది. మైనార్టీ షేర్‌హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలతో కేసు దాఖలు చేయాలంటే... కనీస షేర్‌హోల్డింగ్ ఉండాలన్న నిబంధన నుంచి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆయనకు మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా మిస్త్రీ కంపెనీలు లేకపోయినప్పటికీ.. అసాధారణ సందర్భాల్లో ఇలాంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని పేర్కొంది.
ఇదే అంశం కారణంగా గతంలో మిస్త్రీ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌టీ కొట్టివేయటంతో... దాన్ని విచారణకు స్వీకరించి మూడు నెలల్లో తేల్చాలని ఎన్‌సీఎల్‌టీని ఆదేశించింది. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.4% వాటా ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్ షేర్లను పక్కన పెడితే 3% కన్నా తక్కువే ఉంటుంది. మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు హరిస్తున్నారన్న ఆరోపణలతో కేసు పెట్టాలంటే కంపెనీలో కనీసం 10% వాటాలు ఉండాలి. తాజా తీర్పును మిస్త్రీ సంస్థలు స్వాగతించాయి. అయితే, పిటిషనర్ల వాదనలు నిరాధారమైనవని టాటా సన్స్ పేర్కొంది. న్యాయస్థానాల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపింది.