
న్యూఢిల్లీ: రుణభారంతో మూతబడుతున్న టెలికం సంస్థల జాబితాలో తాజాగా ఎయిర్‌సెల్ కూడా చేరబోతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయనుంది. మలేసియాకి చెందిన మాతృ సంస్థ మ్యాక్సిస్ గతంలో ఎయిర్‌సెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రూ. 15,500 కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ కోసం గతేడాది సెప్టెంబర్ నుంచి బ్యాంకులతో ఎయిర్‌సెల్ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఫలితం కనిపించలేదని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని నిర్వహించేందుకు కంపెనీ దగ్గర ప్రస్తుతం కనీస స్థాయిలో కూడా నిధులు లేవని, ఈ వారాంతంలో ఉద్యోగుల జీతాలను చెల్లించడం కూడా నిలిపివేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి.
భేటీ కానున్న బ్యాంకర్లు..
మొండిబాకీల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, దివాలా చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే పలు రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాలను ఎత్తివేయడం సైతం ఎయిర్‌సెల్ తాజా పరిణామానికి కారణంగా మారాయి. సెప్టెంబర్ నుంచి ఎయిర్‌సెల్ బకాయిలను చెల్లించడం లేదు. తాజాగా మారిన నిబంధనల ప్రకారం ఎయిర్‌సెల్ రుణబకాయిలను బ్యాంకులు పునర్‌వ్యవస్థీకరించే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కంపెనీ బోర్డును రద్దు చేసిన ఎయిర్‌సెల్ .. కొత్త బోర్డు ఏర్పాటు, దివాలా పిటిషన్ దాఖలుకి సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించేందుకు దివాలా చట్టం ప్రొఫెషనల్‌ను నియమించుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేసుకోనుంది. ఈ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు చర్చించేందుకు బ్యాంకర్లు మంగళవారం భేటీ కానున్నట్లు సమాచారం.
మలేసియాకి చెందిన మాతృసంస్థ మద్దతు ఉన్న కారణంగా ఎయిర్‌సెల్ నుంచి బకాయిలు రాబట్టుకోగలమని ఇటు బ్యాంకర్లు, అటు సరఫరా సంస్థలు కొంత ధీమాగా ఉన్నాయి. దాదాపు రూ. 500 కోట్ల దాకా నిధులు సర్దుబాటు చేస్తామని, వివిధ సర్కిల్స్‌లో లైసెన్సు ఫీజు కింద చెల్లించేందుకు అవసరమైతే మరో రూ. 500 కోట్ల దాకా సమకూరుస్తామని మ్యాక్సిస్ .. బ్యాంకర్లకు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
ప్రతి నెలా రూ. 400 కోట్ల ఆదాయం.. కానీ...
ఎయిర్‌సెల్ ఆదాయం ప్రతి నెలా సుమారు రూ. 400 కోట్ల మేర ఉంటోంది. ఇందులో రూ. 100 కోట్లు ఇతర ఆపరేటర్లకు కాల్ టర్మినేషన్ చార్జీల కింద చెల్లిస్తుండగా, మరో రూ. 280 కోట్లు వెండార్స్ మొదలైనవారికి చెల్లిస్తోంది. మిగతాది లైసెన్సు ఫీజులు, పన్నులు, వడ్డీల కింద కడుతోంది.
అయితే, గత మూడు నెలలుగా రూ. 60 కోట్ల మేర బాకీ పడటంతో ఐడియా సెల్యులార్ ఇటీవలే ఎయిర్‌సెల్‌కి ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను నిలిపివేసింది. ఇక మెరుగైన సర్కిల్స్‌పైనే దృష్టి పెట్టేందుకు ఎయిర్‌సెల్ సైతం ఇటీవల ఆరు సర్కిల్స్‌లో సేవలు నిలిపివేసింది. ఎయిర్‌సెల్ మూతబడితే 5,000 మంది ఉద్యోగులు, వెండార్స్.. జీటీఎల్ ఇన్‌ఫ్రా.. భారతి ఇన్‌ఫ్రాటెల్.. ఇండస్ టవర్స్.. ఏటీసీ వంటి టవర్ ఆపరేటింగ్ భాగస్వాములపై ప్రతికూల ప్రభావం పడనుంది.
ఇప్పటికే కొన్ని కంపెనీలు బాకీలు రాబట్టుకోవడం కోసం ఎయిర్‌సెల్‌పై దావాలు కూడా వేశాయి. ఎరిక్సన్, నోకి యా, జెడ్‌టీఈ వంటి నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సంస్థలు సెప్టెంబర్ నుంచి బకాయిల రికవరీపై చర్చలు జరుపుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అవుట్‌సోర్సింగ్ టెక్నాలజీ, కాల్ సెంటర్ సర్వీస్ సంస్థలకు కూడా ఎయిర్‌సెల్ చెల్లింపులు జరపడం లేదు.
జియో దెబ్బకి నాలుగోది..
టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. 2016 సెప్టెంబర్‌లో చౌక చార్జీలతో రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్‌సెల్ నాలుగోది కానుంది. జియో రాకతో టెలికం పరిశ్రమ ఆదాయాలు సగానికి పడిపోగా.. టారిఫ్‌లు సైతం గణనీయంగా క్షీణించాయి. నార్వేకి చెందిన టెలినార్ తమ భారత వ్యాపార విభాగాన్ని మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కి బదలాయిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ అటు టాటా టెలిసర్వీసెస్‌కి చెందిన వైర్‌లెస్ వ్యాపార విభాగాన్ని కూడా టేకోవర్ చేస్తోంది.
మరోవైపు, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి చెందిన వైర్‌లెస్ వ్యాపార విభాగానికి సంబంధించిన అసెట్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది. జియో రావడానికి ముందు.. 2016 జూలై దాకా ఎయిర్‌సెల్ పరిస్థితి మెరుగ్గానే ఉండేది. త్రైమాసికంలో సుమారు రూ. 120 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. కానీ సెప్టెంబర్‌లో జియో వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. క్రమంగా కస్టమర్స్ చేజారిపోయారు. డిసెంబర్ నాటికి యూజర్స్ సంఖ్య సుమారు 25 లక్షలు తగ్గి 8.5 కోట్లకు పరిమితమైంది.
చార్జీలను సగానికన్నా తగ్గించినా కూడా పోటీ సంస్థ ఉచిత సేవల ముందు తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని కంపెనీ వర్గాలు గతంలోనే పేర్కొన్నాయి. 2017 జూలైలో జియో చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టే నాటికి ఎయిర్‌సెల్ నిర్వహణ లాభం రూ. 5 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిర్‌సెల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 79 శాతం నుంచి 57 శాతానికి, ప్రతి యూజర్‌పై సగటు ఆదాయం సగానికి క్షీణించాయి.
ఇక త్రైమాసికాలవారీగా రూ. 120 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో దాదాపు అలాంటి పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతున్న మరో టెల్కో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో విలీన చర్చలు ప్రారంభించింది ఎయిర్‌సెల్. కానీ అనుమతులు రావడంలో జాప్యాలు, ఎయిర్‌సెల్ స్పెక్ట్రం విక్రయానికి ప్రతికూలంగా న్యాయస్థానం ఆదేశాలు మొదలైనవి విలీన ప్రయత్నాలకు గండికొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment