న్యూఢిల్లీ: దాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు.
రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు. తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.
మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైందని, క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment