
డెల్ నుంచి రగ్‌డ్ నోట్‌బుక్స్..
న్యూఢిల్లీ: భారీ వర్షాల్లో తడిసినా పాడవని, ఆరు అడుగుల ఎత్తు నుంచి పడినా పనిచేసే, 60 కేజీలకు పైబడిన బరువు మీద పడినా సరే చెక్కు చెదరని రగ్‌డ్ నోట్‌బుక్‌లను డెల్ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. చమురు, గనులు, రక్షణ, మౌలిక రంగాల్లో పనిచేసే వారి కోసం ఈ రగ్‌డ్ నోట్‌బుక్‌లు, - డెల్ ల్యాటిట్యూడ్ 12 రగ్‌డ్ ఎక్స్‌ట్రీమ్ (ధర రూ.2.39 లక్షలు), లాటిట్యూడ్ 14 రగ్‌డ్ ఎక్స్‌ట్రీమ్(ధర రూ.2.29 లక్షల నుంచి)లను అందిస్తున్నామని డెల్ ఇండియా డెరైక్టర్, జనరల్ మేనేజర్ ఇంద్రజిత్ బెల్‌గుండి చెప్పారు.
భారత్‌లో ఈ తరహా నోట్‌బుక్‌లు ఇవే మొదటివని పేర్కొన్నారు. మైనస్ 29 నుంచి 63 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతల్లో కూడా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. లాటిట్యూడ్ 12లో 12 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని, బరువు 2.72 కేజీలని తెలిపారు. దీంట్లోంచి నోట్‌బుక్‌ను తీసివేస్తే ట్యాబ్‌గా కూడా వాడుకోవచ్చని వివరించారు.