వాక్యూమ్ క్లీనర్‌లా లాగేశారు!
డీమోనిటైజేషన్ ప్రక్రియపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యాఖ్యలు...
⇒ కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకే...
⇒ ప్రజలు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్నారు...
⇒ వినిమయంపై భారీగా ప్రతికూల ప్రభావం...
వాషింగ్టన్: మోదీ సర్కారు చేపట్టిన నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) వ్యవహారంపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. రద్దు రేసిన రూ.1,000; రూ.500 పెద్ద నోట్లను వ్యవస్థ నుంచి వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా వెనక్కి లాగేశారని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే, వాటి స్థానంలో కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకగా సాగిందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ అభిప్రాయపడ్డారు. డీమోనిటైజేషన్‌తో దేశంలో తీవ్ర నగదు కొరతకు దారితీసిందని.. ప్రజల వినిమయంపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఆయన అన్నారు. ‘రద్దయిన నోట్లను వ్యవస్థ నుంచి వెనక్కి గుంజేసిన తర్వాత వాక్యూమ్ క్లీనర్ రివర్స్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. కొత్త నోట్ల సరఫరా చాలా నెమ్మదిగా జరిగింది.
దీనివల్ల నగదు కొరత తీవ్రతరమై.. వినిమయం తీవ్రంగా పడిపోయింది’ అని ఆయన చెప్పారు.‘అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టిన సహాయ ప్యాకేజీలు ‘హెలీకాప్టర్ డ్రాప్స్’గా (హెలికాప్టర్ ద్వారా నగదు వెదజల్లడం) చాలా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారత్‌లో చేపట్టిన డీమోనిటైజేషన్ ప్రక్రియను ‘వాక్యూమ్ క్లీనర్’తో పోల్చవచ్చు’ అని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ విశ్లేషించారు. భారత్‌పై ఐఎంఎఫ్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు కషిన్ పైవిధంగా స్పందించారు. ఇండియా మిషన్ చీఫ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. నివేదికలో వివరాలు...
⇔ ప్రస్తుతం ఇంకా మార్కెట్లో నగదు కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త నోట్ల సరఫరా పెంపును కొనసాగించాలి. అవసరమైతే తాత్కాలిక మినహాయింపులను పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పాత నోట్లను మళ్లీ వినియోగించడం కూడా ఇందులో ఒకటి.
⇔ నోట్ల రద్దు కారణంగా తాత్కాలికంగా ఎదురుకానున్న వృద్ధి మందగమనాన్ని తట్టుకునే సామర్థ్యం ఫైనాన్షియల్ వ్యవస్థకు ఉంది. అయితే, కార్పొరేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మొండి బకాయిలు మరింత ఎగబాకే అవకాశం ఉంది.
⇔ దీనివల్ల బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. డీమోనిటైజేషన్ వల్ల దెబ్బతిన్న రంగాలకు తగిన చేయూతనివ్వాలి.
⇔ నోట్ల రద్దు ప్రకంపనలు ఆర్థిక వ్యవస్థలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉంది. మార్చి చివరికి ఈ సమస్యలు తగ్గుముఖం పట్టొచ్చు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం... సానుకూల రుతుపవనాలు, సరఫరాపరమైన అడ్డంకుల తొలగింపులో పురోగతి వంటివి డీమోని టైజేషన్ ఇబ్బందులను అధిగమించడంలో తోడ్పడతాయి.
గ్లోబల్ షాక్‌ల ప్రభావం భారత్‌పై తక్కువే..
భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉందని ఐఎంఎఫ్ సీనియర్ అధికారి పాల్ కషిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే షాక్‌ల ప్రభావం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగానే ఉంటుందని చెప్పారు. ‘ఇటీవలి కాలంలో పలు దేశాల్లో వృద్ధి మందగమనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీవ్రంగా దెబ్బతినడం, డిమాండ్ పడిపోవడం వంటివి జరిగితే భారత్‌పైనా ప్రభావం చూపుతుంది. అయితే, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ ప్రభావం స్వల్పమే’ అని ఆయన తెలిపారు.
ప్రధానంగా దేశీ డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో డీమోనిటైజేషన్‌కు ముందు వినిమయం అత్యంత మెరుగైన స్థితిలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న ద్రవ్యపరపతి విధానం, కార్యాచరణ భేషుగ్గా ఉందని కషిన్ చెప్పారు. ‘డీమోనిటైజేషన్ వల్ల వినిమయం దెబ్బతినడం వంటి స్వల్పకాలిక అడ్డంకులు తొలగిపోతే.. వృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. ప్రస్తుత 2016–17లో వృద్ధి రేటు 6.6%కి తగ్గొచ్చు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే, మధ్యకాలానికి మళ్లీ 8%పైగా వృద్ధి రేటు బాటలోని వచ్చేస్తుంది’ అని కషిన్ వివరించారు.