తీవ్ర హెచ్చుతగ్గులకు చాన్స్
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ప్రధాన సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని చెప్పారు. గురువారం(25న) ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుంది. మరోవైపు అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇక ముడిచమురు ధరలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. కాగా, సమీప కాలానికి ఈ నెల చివర్లో(30న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్ష మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనుందని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత పరిస్థితినే కొనసాగించే అవకాశముందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అంచనా వేశారు.
ఆర్థిక వ్యవస్థపై ఆశలు
దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలులేని నేపథ్యంలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, రూపాయి కదలికలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై అంచనాలతో గత వారం మొదట్లో మార్కెట్లు డీలాపడినప్పటికీ, రేట్ల పెంపు నిర్ణయం లేకపోవడంతో చివర్లో జోరందుకున్న సంగతి తెలిసిందే.
దీనికితోడు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలు ఈ వారం మార్కెట్లను ముందుకు దౌడు తీయించగలవని అమన్ అంచనా వేశారు. పాలసీ సమీక్ష వివరాలను వెల్లడిస్తూ ఫెడరల్ రిజర్వ్ చైర్‌ఉమన్ జానట్ యెలెన్ మరికొంత కాలం నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నెలకు 85 బిలియన్ డాలర్లను అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్ చేయడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ అక్టోబర్‌లో ముగియనున్న నేపథ్యంలో రేట్ల పెంపు వాయిదా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడిందని వివరించారు. ఫెడ్ తాజా నిర్ణయంతో మరికొంతకాలం విదేశీ పెట్టుబడులకు ఢోకా ఉండబోదని, ఇది భారత్‌సహా వర్థమాన మార్కెట్లకు తీపి కబురు అందించిందని వ్యాఖ్యానించారు.
మోడీ యూఎస్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 29-30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు మోడీ వైట్‌హౌస్‌ను సందర్శించనున్నారు. పర్యటనకు సంబంధించిన అంశాలపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, గడిచిన వారం ఎగుడుదిగుడు నడకలో సాగిన సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు మాత్రమే జమ చేసుకోవడం గమనార్హం. వెరసి 27,090 వద్ద ముగిసింది.