ఏ ఫండ్స్‌లో ఎంతెంత పెట్టుబడులు? | dheerendranath clarifications on mutual funds and investments | Sakshi
Sakshi News home page

ఏ ఫండ్స్‌లో ఎంతెంత పెట్టుబడులు?

Published Mon, Jul 10 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

ఏ ఫండ్స్‌లో ఎంతెంత పెట్టుబడులు?

ఏ ఫండ్స్‌లో ఎంతెంత పెట్టుబడులు?

ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌(యూఎల్‌పీపీ)లను ఎంచుకోవడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. ఈ తరహా ప్లాన్‌లు ఖరీదైనవి.

నేను హెచ్‌డీఎఫ్‌సీ యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ప్లాన్‌లో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?
–రాజ్, విశాఖపట్టణం

ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్‌(యూఎల్‌పీపీ)లను ఎంచుకోవడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. ఈ తరహా ప్లాన్‌లు ఖరీదైనవి. పైగా ఇవి తగిన రాబడులనివ్వలేవు. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చార్జీలతో పాటు ప్రీమియమ్‌ అలకేషన్‌ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలు, మోరాలిటీ చార్జీలు, తదితర చార్జీల వ్యయం అధికంగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎప్పుడూ బీమా కలగలసిన ప్లాన్‌లను ఎంచుకోకూడదు. బీమా అవసరాల కోసం పూర్తిగా టర్మ్‌ ప్లాన్‌ను తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా కవరేజ్‌ పొందవచ్చు. ఇక అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తాయి. అందుకని మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వేల్యూ డిస్కవరీ ఫండ్‌ ఇటీవల కాలంలో మంచి పనితీరు కనబరచడం లేదు. అందుకని ఈ ఫండ్‌ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని, మరో మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?
–కిరణ్‌ కుమార్, ఈ మెయిల్‌ ద్వారా

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వేల్యూ డిస్కవరీ ఫండ్‌ ట్రాక్‌ రికార్డ్‌ బావుంది. ఇటీవల కాలంలో ఈ ఫండ్‌ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. గతంలో ఈ ఫండ్‌ పనితీరు బాగా ఉండటంతో పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఈ పెట్టుబడుల భారం కారణంగా రాబడులు తగ్గాయి. అయినప్పటికీ, ఇప్పటికీ ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు.  అత్యున్నత నాణ్యత గల పోర్ట్‌ఫోలియో ఈ ఫండ్‌కు ఉంది. ఈ ఫండ్‌ మేనేజర్‌ కూడా మంచి సమర్థత గలవ్యక్తే. మార్కెట్‌ పెరుగుతున్న దశలో ఈ ఫండ్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మంచి పనితీరును కనబరిచేలా ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను ఈ ఫండ్‌ మేనేజర్‌ రూపొందించారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలో  పెట్టుబడి నిర్ణయాలు ఎప్పుడూ స్వల్పకాల పనితీరును బట్టి ఉండకూడదు. దీర్ఘకాల పనితీరును బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఏడాది పనితీరును పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదు. కనీసం మూడేళ్ల ట్రాక్‌ రికార్డ్‌ను మదింపు చేసి ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోవాలి.  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వేల్యూ డిస్కవరీ ఫండ్‌ ట్రాక్‌ రికార్డ్‌ బాగా ఉంది. కాబట్టి  ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకోవడమే ఉత్తమం.

నేను సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నాను. మంచి ఆదాయమే వస్తోంది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే నా  పోర్ట్‌ఫోలియోలో లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఎంతెంత స్థాయిల్లో  పెట్టుబడులు పెట్టాలి. వివరించండి.
–రమేశ్, హైదరాబాద్‌

ఈ తరహా ఫండ్స్‌లో ఇంత స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని సాధారణ నియమమేమీ లేదు. అయితే ఒక ఇన్వెస్టర్‌ తన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65–70 శాతం వరకూ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోనూ, 20 శాతం మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోనూ, 10–15 శాతం స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉంటుందని నిపుణులంటారు. ఇదే స్థాయిలో మీరు కూడా ఇన్వెస్ట్‌ చేయాలని లేదు. కొంచెం అటూ, ఇటూగా కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే లిక్విడిటీ అధికంగా ఉండే లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌  ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా లిక్విడిటీ సమస్యలు ఉండవు.  మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు  స్మాల్‌క్యాప్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించుకోవడం కొంచెం సమస్యాత్మకమైన పనే. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో అధిక భాగం లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు ఇటీవలనే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది మా లక్ష్యం. ఇరువురం కలసి రూ.30,000 వరకూ పొదుపు చేయగలం. స్టాక్‌ మార్కెట్లో మంచి రాబడులు వస్తాయి కానీ, వాటిపై నాకు అవగాహన తక్కువ. మ్యూచువల్‌ ఫండ్స్‌లో కూడా ఇప్పటివరకూ ఇన్వెస్ట్‌ చేసింది లేదు. మా సొంత ఇంటి లక్ష్యం త్వరగా సాకారం కావడానికి తగిన సూచనలు ఇవ్వండి.             –వీరేందర్, హైదరాబాద్‌
రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం... వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమైన మార్గం. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్రవ్యోల్బ ణాన్ని తట్టుకునే రాబడులనిస్తాయి. మీరు మ్యూచువల్‌ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి. ముందుగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో 1–2 సంవత్సరాలు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వచ్చిన తర్వాత డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని, ఆ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇక బీమా అవసరాల కోసం టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి. ఆన్‌లైన్‌ టర్మ్‌ బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది.
- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement