40 మిలియన్ డాలర్లూ తిరిగివ్వండి
మాల్యాకు డియాజియో డిమాండ్
లండన్/న్యూఢిల్లీ: యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగే డీల్‌లో భాగంగా చెల్లించిన 40 మిలియన్ డాలర్లను తమకు వాపస్ చేయాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యాను డియాజియో కోరింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నష్టపరిహారం కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సర ప్రాథమిక ఫలితాల వెల్లడి సందర్భంగా డియాజియో ఈ విషయాలు పేర్కొంది.
రుణ సంక్షోభంతో మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ప్రమోటర్ కూడా అయిన మాల్యా... ప్రస్తుతం ఉద్దేశపూర్వక ఎగవేతదారు ఆరోపణలతో బ్రిటన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి తప్పుకుంటున్నందుకు గాను మాల్యాకు డియాజియో 75 మిలియన్ డాలర్లు ఇచ్చేలా గతంలో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2016 ఫిబ్రవరి 25న 40 మిలియన్ డాలర్లు చెల్లించిన కంపెనీ.. మిగతా 35 మిలియన్ డాలర్లను ఏటా 7 మిలియన్ డాలర్ల చొప్పున అయిదేళ్లు చెల్లించాల్సి ఉంది. అయితే, మాల్యా నిబంధనలను ఉల్లంఘించడంతో మిగతా చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు డియాజియో పేర్కొంది.