మాల్యా కేసులో మా ఆర్డర్ ఫలించలేదు
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయమాల్యాతో బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో ఒప్పందం మేరకు అతనికి తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను నిలిపివేయాలన్న రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు వ్యర్థమయ్యాయని డీఆర్‌టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) సీఆర్ బెనకనహళ్లి తెలిపారు. మార్చి 7 న జారీచేసిన ఈ ఆదేశాలకు ముందే సదరు మొత్తం మాల్యా బ్యాంక్ ఖాతాలో జమఅయ్యాయని వెల్లడించారు. ముంబై సర్వీస్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. మార్చి 7 ట్రిబ్యునల్ ఆర్డర్ కంటే చాలా ముందుగానే బదిలీ జరగడంతో తమ ఆదేశాలు ఫలించలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం మాల్యా ఖాతాలోఆ సొమ్ము మొత్తం జమ అయ్యాయన్నారు.
అలాగే ట్రిబ్యునల్ నిబంధనలు, షరతులు ప్రకారం , మిగిలిన 35 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేయమని ఆదేశించలేమన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వారి ఒప్పందం అమల్లో ఉంటుంది గనుక అటు మాల్యాకు గానీ, డియాజియో కు ఈ తరహా ఆదేశాలివ్వలేమని బెనకనహళ్లి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలోరుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని బ్యాంకులకు మొట్టికాయలు వేసిన బెనహనకల్లి తాజాగా టాక్స్ డిపార్ట్ మెంట్ వైఖరిని కూడా దుయ్యబట్టారు. ఎటాచ్ చేయబడిన మాల్యా స్థిర,చరాస్తులను ఎందుకు విక్రయించలేదని సేవా పన్ను శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, విమానం, హెలికాప్టర్లు అమ్మకం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి(14 జూలై గురువారం) వాయిదా వేశారు.
డియోజియో కంపెనీమాల్యాకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తాన్ని చెల్లించవద్దని ఇటివల డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ) ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్‌టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఒప్పందాన్నిప్రకారం ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్‌బీఐ కాన్సార్షియం డీఆర్‌టీని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలోఆ చెల్లింపులను నిలిపివేయాలని డియోజియోను డీఆర్ టీని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.