DRT
-
రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ డీఆర్టీని ఆశ్రయించింది. దీంతో జూలై 11వ తేదీ ఉదయం 10.30లోగా నేరుగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్టీ స్పష్టం చేసింది. కేశినేని నానితో పాటు కేశినేని పావని, కేశినేని కార్గో అండ్ కారియర్స్ లిమిటెడ్‌లకు కూడా పత్రికా ప్రకటన ద్వారా డీఆర్టీ సమన్లు జారీ చేసింది. -
బ్యాంకులకు 529 కోట్లు ఎగ్గొట్టిన వాకాటి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా (ప్రస్తుతం సస్పెండ్ చేశారు) ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డికి చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బ్యాంకులకు రూ. 529.34 కోట్లు బకాయి పడింది. దీంతో మీ ఆస్తులను రుణం కింద ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) పత్రికా ప్రకటన ద్వారా బహిరంగ షోకాజు నోటీసు జారీ చేసింది. ఆస్తులు స్వాధీనం చేసుకొని బ్యాంకులకు అనుకూలంగా ఎందుకు తీర్పు ఇవ్వకూడదో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా మొత్తం ఆస్తుల చిట్టాతో డిసెంబర్ 8న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డీఆర్టీ ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించింది. -
కేసులు పెరగడానికి ప్రధాన కారణమిదే!
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రుణాల రికవరీ ట్రిబ్యునల్ వద్ద కేసుల జాబితా పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫిర్యాదులు దాఖలు చేయడమేనని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతోనే బ్యాంకులు ఈ ఫిర్యాదులను దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఆర్టీలో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి సెక్యురిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లో ప్రభుత్వం సవరణలు చేపట్టిందన్నారు. రుణాల రికవరీకి సంబంధించి 2016 నవంబర్ 5న సెమినార్ నిర్వమించామని, ఆ సెమినార్లో అప్పీలెట్ ట్రిబ్యునల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. రికవరీ చట్టాల్లో సవరణలు, ఆర్థికంగా దివాలా కోడ్ 2016 వంటివాటిపై చర్చించామని పేర్కొన్నారు. విశాఖపట్నం డీఆర్టీలో ఏడాది ఏడాదికి కేసులు పెరగడంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి మంగళవారం జరిగిన రాజ్యసభలో పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అదే నిజమైతే కేసులను సత్వరంగా పరిష్కరించడానికి డీఆర్టీ, మంత్రిత్వశాఖ తీసుకునే చర్యలపై ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. -
రూ.6,203 కోట్ల బకాయిలు..రికవరీ మొదలెట్టండి
విజయ్‌మాల్యా రుణ ఎగవేతపై బ్యాంకులకు డీఆర్టీ ఆదేశం • వార్షికంగా 11.5% వడ్డీ విధింపు • కింగ్‌ఫిషర్ కేసుపై ట్రిబ్యునల్‌లో ముగిసిన మూడేళ్ల న్యాయపోరాటం బెంగళూరు: కింగ్ ఫిషర్ రుణాల కేసులో బ్యాంకింగ్ ఉద్దేశపూర్వక ఎగవేతదారు విజయ్‌మాల్యా, ఆయన కంపెనీల నుంచి బకాయిల వసూళ్ల ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ఇక్కడి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ), రూ.6,203 కోట్ల రికవరీ ప్రక్రియను ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంను ఆదేశించింది. 11.5 శాతం వార్షిక వడ్డీని బకాయిలపై వసూలు చేయాలని నిర్దేశించింది. ‘‘11.5 శాతం వడ్డీతో రూ.6,203 కోట్లను యూబీహెచ్ఎల్, కింగ్‌ఫిషర్ ఫిన్వెస్ట్, కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్సహా మాల్యా ఆయన కంపెనీల నుంచి రికవరీ చేయాలని డీఆర్టీ నిర్దేశిస్తోంది’’ అని తన ఉత్తర్వుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కే శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించి మాల్యా ఆయన కంపెనీలు దాఖలు చేసిన దాదాపు 20 అనుబంధ పిటిషన్లను (ఐఏ) కూడా డీఆర్టీ పరిష్కరించింది. మూడేళ్ల విచారణ... కింగ్‌ఫిషర్ బకాయిల వసూలుకు 2013లో బ్యాంకింగ్ డీఆర్టీని ఆశ్రయించింది. మాల్యా అరెస్ట్, ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం వంటి అభ్యర్థనలతో ఎస్బీఐ మరో మూడు పిటిషన్లు దాఖలు చేసింది. గత ఏడాది మార్చి 2వ తేదీన మాల్యా బ్రిటన్‌కు పారిపోయిన తరువాత ఆయనను ముంబైలోని అక్రమ ధనార్జనా నిరోధక ప్రత్యేక కోర్టు ‘ప్రకటిత నేరస్తునిగా’ పేర్కొంది. మాల్యా రుణ ఎగవేతలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మరోవైపు విచారణ జరుపుతోంది. డియోజియో నియంత్రణలోని యునైటెడ్ స్పిరిట్స్ నుంచి చైర్మన్‌గా వైదొలగినందుకుగాను మాల్యాకు ఆ సంస్థ చెల్లించాల్సిన 75 బిలియన్ డాలర్లను బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోకుండా నిరోధిస్తూ... డీఆర్టీ మార్చి 7న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అంతకుముందే ఇందులో 40 మిలియన్ డాలర్లు విత్‌డ్రా అయినట్లు వెల్లడికావడంతో మార్చి 7న ఉత్తర్వులను ‘మురిగిపోయినట్లు’గా ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే బ్యాంకింగ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ట్రిబ్యునల్ రూలింగ్ ఇస్తూ... మిగిలిన 35 మిలియన్ డాలర్లను ట్రిబ్యునల్‌లో డిపాజిట్ చేయాలని డియోజియోను ఆదేశించింది. అప్పీల్ చేస్తాం: యూబీ గ్రూప్ డీఆర్టీ ఉత్తర్వుపై అప్పీల్‌కు వెళతామని విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ప్రకటించింది. ఉత్తర్వు ప్రతికోసం ఎదురుచూస్తున్నామని, ఇది అందిన తరువాత తగిన విధంగా చర్యలు తీసుకుంటామని యూబీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
మాల్యాపై తీర్పు నేడే..!
బెంగళూరు: వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) గురువారం తీర్పును వెలువరించనుంది. మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ 9,000 కోట్లను రాబట్టేందుకు ఎస్బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై ఇవాళ ఆర్డర్ ను పాస్ చేయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసుకు సంబంధించిన బ్యాంకుల మధ్యంతర పిటిషన్ పై తీర్పును వెలువరించనున్నట్టు డీఆర్ టీ ప్రిసైడింగ్ అధికారి కె శ్రీనివాసన్ బుధవారం ప్రకటించారు. దీంతో దాదాపు మూడేళ్ల న్యాయపోరాటానికి తెరపడనుంది. 17బ్యాంకులకు చెందిన ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్‌ను డిసెంబర్ 1994 నుంచి డీఆర్ టీ విచారిస్తోంది. ఎస్బీఐతో సహా 17 బ్యాంకుల వద్ద మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను తీసుకుంది. కాగా వాటిని తిరిగి చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం డీఆర్టీని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయిందని ఇటీవల ప్రకటించిన ట్రిబ్యునల్ తీర్పును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. కాగా మాల్యా గత సంవత్సరం మార్చి 2 న దేశం వదిలి బ్రిటన్ కు చెక్కేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసున కేసులో ముంబై పీఎంఎల్ ఏ కోర్టుగా ఉద్దేశ పూర్వగ ఎగవేతదారుడుగా తేల్చిన సంగతి తెలిసిందే. -
మాల్యా కేసులో మా ఆర్డర్ ఫలించలేదు
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయమాల్యాతో బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో ఒప్పందం మేరకు అతనికి తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను నిలిపివేయాలన్న రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు వ్యర్థమయ్యాయని డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) సీఆర్ బెనకనహళ్లి తెలిపారు. మార్చి 7 న జారీచేసిన ఈ ఆదేశాలకు ముందే సదరు మొత్తం మాల్యా బ్యాంక్ ఖాతాలో జమఅయ్యాయని వెల్లడించారు. ముంబై సర్వీస్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. మార్చి 7 ట్రిబ్యునల్ ఆర్డర్ కంటే చాలా ముందుగానే బదిలీ జరగడంతో తమ ఆదేశాలు ఫలించలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం మాల్యా ఖాతాలోఆ సొమ్ము మొత్తం జమ అయ్యాయన్నారు. అలాగే ట్రిబ్యునల్ నిబంధనలు, షరతులు ప్రకారం , మిగిలిన 35 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేయమని ఆదేశించలేమన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వారి ఒప్పందం అమల్లో ఉంటుంది గనుక అటు మాల్యాకు గానీ, డియాజియో కు ఈ తరహా ఆదేశాలివ్వలేమని బెనకనహళ్లి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలోరుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని బ్యాంకులకు మొట్టికాయలు వేసిన బెనహనకల్లి తాజాగా టాక్స్ డిపార్ట్ మెంట్ వైఖరిని కూడా దుయ్యబట్టారు. ఎటాచ్ చేయబడిన మాల్యా స్థిర,చరాస్తులను ఎందుకు విక్రయించలేదని సేవా పన్ను శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, విమానం, హెలికాప్టర్లు అమ్మకం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి(14 జూలై గురువారం) వాయిదా వేశారు. డియోజియో కంపెనీమాల్యాకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తాన్ని చెల్లించవద్దని ఇటివల డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఒప్పందాన్నిప్రకారం ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలోఆ చెల్లింపులను నిలిపివేయాలని డియోజియోను డీఆర్ టీని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. -
కోర్టు జప్తుల్లోఉన్న రూ.2,000 కోట్లపై దృష్టి పెట్టండి
ముందుగా వాటిని రికవరీ చేసుకోండి.. ‘కింగ్‌ఫిషర్’ మాల్యా కేసులో బ్యాంకులకు డీఆర్టీ సూచన బెంగళూరు: కింగ్‌షిఫర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) మంగళవారం కీలక సూచనలు చేసింది. రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవాలంటే.. ముందుగా ఈ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల జప్తుల్లో ఉన్న దాదాపు రూ.2,000 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకోవడంపై దృష్టిసారించాలని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహళ్లి సూచించారు. దీన్ని పరిష్కరించుకోవడానికి బ్యాంకులన్నీ కలసికట్టుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల కన్సార్సియం, డియాజియో(హోల్డింగ్స్) నెదర్లాండ్స్ తమ పిటిషన్లను ప్రాధాన్య ప్రాతిపదికన విచారించాలంటూ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన పీఓ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టుల దగ్గరున్న రూ.2,000 కోట్లను రికవరీ చేసుకోగలిగితే వడ్డీరూపంలో రూ.200-300 కోట్లు లభిస్తాయని.. నష్టం కొంతైనా పూడుతుందని బెనకనహళ్లి బ్యాంకుల కన్సార్షియంకు సూచించారు. -
మాల్యాకు రూ.270 కోట్లు చెల్లించొద్దు..
డియాజియోకు డీఆర్టీ ఆదేశం బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయల రుణ ఎగవేత ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియోతో ఒప్పందం మేరకు ఆయనకు తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను చెల్లించవద్దని ఆ కంపెనీని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) మంగళవారం ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు సంబంధించిన సంస్థ వాట్సన్ లిమిటెడ్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన షేర్లను ట్రిబ్యునల్‌కు అటాచ్ చేయాల్సిందిగా డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహల్లి ఆదేశించారు. బ్యాంకులకు మొట్టికాయలు... మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి మాల్యా నిరాకరించారు. దీంతో కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఆయనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది. ఈ నేపథంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, డియాజియోతో మల్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మీకు తెలిసినప్పటికీ.. ఆ సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు తెలుసుకోవడం, తగిన చర్యలు చేపట్టడం వంటివి ఎందుకు చేయలేదని బ్యాంకర్లను బెనహనకల్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని కూడా ఆయన తప్పుబట్టారు. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.