రూ.6,203 కోట్ల బకాయిలు..రికవరీ మొదలెట్టండి
విజయ్‌మాల్యా రుణ ఎగవేతపై బ్యాంకులకు డీఆర్‌టీ ఆదేశం
• వార్షికంగా 11.5% వడ్డీ విధింపు
• కింగ్‌ఫిషర్ కేసుపై ట్రిబ్యునల్‌లో ముగిసిన మూడేళ్ల న్యాయపోరాటం
బెంగళూరు: కింగ్ ఫిషర్ రుణాల కేసులో బ్యాంకింగ్ ఉద్దేశపూర్వక ఎగవేతదారు విజయ్‌మాల్యా, ఆయన కంపెనీల నుంచి బకాయిల వసూళ్ల ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ఇక్కడి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ), రూ.6,203 కోట్ల రికవరీ ప్రక్రియను ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంను ఆదేశించింది. 11.5 శాతం వార్షిక వడ్డీని బకాయిలపై వసూలు చేయాలని నిర్దేశించింది. ‘‘11.5 శాతం వడ్డీతో రూ.6,203 కోట్లను యూబీహెచ్‌ఎల్, కింగ్‌ఫిషర్ ఫిన్‌వెస్ట్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌సహా మాల్యా ఆయన కంపెనీల నుంచి రికవరీ చేయాలని డీఆర్‌టీ నిర్దేశిస్తోంది’’ అని తన ఉత్తర్వుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కే శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించి మాల్యా ఆయన కంపెనీలు దాఖలు చేసిన దాదాపు 20 అనుబంధ పిటిషన్లను (ఐఏ) కూడా డీఆర్‌టీ పరిష్కరించింది.
మూడేళ్ల విచారణ...
కింగ్‌ఫిషర్ బకాయిల వసూలుకు 2013లో బ్యాంకింగ్ డీఆర్‌టీని ఆశ్రయించింది. మాల్యా అరెస్ట్, ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం వంటి అభ్యర్థనలతో ఎస్‌బీఐ మరో మూడు పిటిషన్లు దాఖలు చేసింది. గత ఏడాది మార్చి 2వ తేదీన మాల్యా బ్రిటన్‌కు పారిపోయిన తరువాత ఆయనను ముంబైలోని అక్రమ ధనార్జనా నిరోధక ప్రత్యేక కోర్టు ‘ప్రకటిత నేరస్తునిగా’ పేర్కొంది. మాల్యా రుణ ఎగవేతలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మరోవైపు విచారణ జరుపుతోంది. డియోజియో నియంత్రణలోని యునైటెడ్ స్పిరిట్స్ నుంచి చైర్మన్‌గా వైదొలగినందుకుగాను మాల్యాకు ఆ సంస్థ చెల్లించాల్సిన 75 బిలియన్ డాలర్లను బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోకుండా నిరోధిస్తూ... డీఆర్‌టీ మార్చి 7న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అంతకుముందే ఇందులో 40 మిలియన్ డాలర్లు విత్‌డ్రా అయినట్లు వెల్లడికావడంతో మార్చి 7న ఉత్తర్వులను ‘మురిగిపోయినట్లు’గా ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే బ్యాంకింగ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ట్రిబ్యునల్ రూలింగ్ ఇస్తూ... మిగిలిన 35 మిలియన్ డాలర్లను ట్రిబ్యునల్‌లో డిపాజిట్ చేయాలని డియోజియోను ఆదేశించింది.
అప్పీల్ చేస్తాం: యూబీ గ్రూప్
డీఆర్‌టీ ఉత్తర్వుపై అప్పీల్‌కు వెళతామని విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ప్రకటించింది. ఉత్తర్వు ప్రతికోసం ఎదురుచూస్తున్నామని, ఇది అందిన తరువాత తగిన విధంగా చర్యలు తీసుకుంటామని యూబీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.