‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’ | What about our salary dues, former employees ask vijay mallya | Sakshi
Sakshi News home page

‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’

Published Thu, Apr 20 2017 3:25 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’

‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి లండన్‌ పారిపోయిన విజయ మాల్యా భారత్‌ రాక కోసం ఒక్క బ్యాంకులే కాదు, ఆయన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగులతో పాటు ఇప్పటికీ కంపెనీ పే రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దాదాపు మూడువేల మంది ఉద్యోగులకు వేతన బకాయిలు, గ్రాట్యుటీల కింద దాదాపు 300 కోట్ల రూపాయలను విజయమాల్యా చెల్లించాల్సి ఉంది. బ్యాంకుల వద్ద మరిన్ని రుణాలు తీసుకొని జీతాల బకాయిలు చెల్లించడంతో పాటు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను పునరుద్ధరిస్తానని మాల్యా చాలాకాలం పాటు ఉద్యోగులకు మాయమాటలు చెప్పారు. చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే లండన్‌ చెక్కేశారు.

2012, సెప్టెంబర్‌ 30వ తేదీన కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసి, 2012, నవంబర్‌ నెలలో రాజీనామా చేసిన  అనిరుధ్‌ బల్లాల్‌ తనకు కంపెనీ నుంచి ఏడు నెలల జీతం బకాయిలు రావాలని మీడియాకు తెలిపారు. ఆయన ఇప్పుడు ముంబైలోని ఏర్‌క్రాఫ్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2013, జూన్‌ 8న ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించేందుకు భారత విమానయానం డైరెక్టర్‌ జనరల్‌ నిరాకరించడంతో ఇక తాను ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించలేనని మాల్యా చేతులెత్తేశారు. బల్లాల్‌కు సకాలంలో ఉద్యోగం దొరికింది కనుక ఆయన అదృష్టవంతుడు. చాలామంది ఉద్యోగాలు దొరక్క చాలాకాలం కంపెనీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఉద్యోగాలు దొరకని దురదృష్టవంతులు ఉన్నారు.

విజయ మాల్యాను లండన్‌లో అరెస్ట్‌ చేశారని తెలిసి ఎంతో సంతోషించానని, అంతలోనే ఆయనకు బెయిల్‌ కూడా లభించిందని తెల్సి నిరుత్సాహానికి గురయ్యానని కింగ్‌ఫిషర్‌ కంపెనీలో ఫ్లైట్‌ సర్వీసు డైరెక్టర్‌గా పనిచేసిన నీతు శుక్లా చెప్పారు. ఆమె 2014, డిసెంబర్‌ నెలలో కంపెనీకి రిజైన్‌ చేశారు. ఆమెకు మూడేళ్ల బకాయిలు రావాలి. విజయ మాల్యా గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ఆయన బ్యాంకులకు ఎగవేసిన రుణాల గురించే మాట్లాడుతుంది తప్ప బాధిత ఉద్యోగుల గురించి మాట్లాడిన సందర్భం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.

కింగ్‌ఫిషర్‌ కంపెనీలో సిస్టమ్స్‌ మేనేజర్‌గా పనిచేసిన రజనీ జైన్‌ ఇప్పటికీ ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. తాము ఇల్లు కొనేందుకు ప్లాన్‌ చేసుకొని అడ్వాన్సు చెల్లించిన మూడు, నాలుగు నెలలకే ఎయిర్‌లైన్స్‌ మూతపడిందని, ఫలితంగా తాము ఇల్లు కొనే ఆలోచనను వదులుకున్నామని ఆమె చెప్పారు. దీని వల్ల తాము అడ్వాన్స్‌గా చెల్లించిన సొమ్మును నష్టపోవాల్సి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు కూడా భారత్‌లోని కంపెనీ పే రోల్స్‌లో 900 మంది ఉద్యోగులు ఉన్నారని ఆమె తెలిపారు. విదేశీ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల విదేశాల్లోని ఉద్యోగులకు కంపెనీ మూతపడినందుకు నష్టపరిహారం కూడా కంపెనీ చెల్లించిందని, ఇక్కడి వారికి జీతం బకాయిలు కూడా చెల్లించలేదని ఆమె వాపోయారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పోయిన కారణంగా నిశ్చితార్థం అయిన తన కొలీగ్‌ పెళ్లి నిలిచిపోయిందని, ఒకరు కిరాయి ఉంటున్న అద్దె ఇంటి నుంచి ఉన్నపళంగా రోడ్డున పడాల్సి వచ్చిందని, మరొకరి తల్లి ఆత్మహత్య చేసుకుందని తన చేదు అనుభవాలను రజనీ మీడియా ముందు గుర్తుచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement