breaking news
salary dues
-
జీతం రాని జీతగాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా...ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు ఇస్తున్నప్పటికీ... వాటిని నెలల తరబడి చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని, కుటుంబ సభ్యులు పస్తులుండాల్సి వస్తోందంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేతనాలు అందకపోవడంతో సంక్రాంతి పండుగ సైతం జరుపుకునే పరిస్థితి లేదంటూ తమ దీన స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున రూ.22 వేల నుంచి రూ.31వేల వరకు ప్రభుత్వం వేతనాల రూపంలో చెల్లిస్తుండగా... పన్నులు, ఇతరత్రా కోతలు పోగా చేతికందేది కేవలం రూ.13వేల నుంచి రూ.20వేలు మాత్రమే. ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఏజెన్సీల చేతిలో మాయ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో ఏజెన్సీ పాత్రే కీలకం. ఉద్యోగుల వేతన నిధులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు కాకుండా సంబంధిత ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఆ నిధుల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, ఏజెన్సీ కమిషన్, ఇతర పన్నుల కింద చేయాల్సిన చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత మిగులును మాత్రమే ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... చెల్లింపులు చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సచివాలయంలోని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ... జిల్లాలు, మండల స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతన చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. కొన్నిచోట్ల 9 నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తమ వేతన చెల్లింపుల జాప్యంపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు చాలా చోట్ల క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసినా వేతనాలు చెల్లించనందున కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలకు దిగుతున్నారు. ఇదీ పరిస్థితి... ⇒ నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 6నెలలుగా వేతనాలు విడుదల కాలేదని అక్కడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ⇒ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయా ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించలేదు. ⇒ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 339 మంది ఉద్యోగులకు 7నెలలుగా వేతనాలు అందలేదు. ⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఆరునెలలుగా, ఎస్సీ వసతి గృహాల్లో పని చేస్తున్న వాచ్మెన్, కామాటిలకు 9నెలలుగా వేతనాలు అందలేదు. ⇒ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 770 మంది ఉద్యోగులకు 5నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ⇒ ఎస్సీ గురుకుల సొసైటీలో ఐఎఫ్ఎంఎస్లో రిజి్రస్టేషన్ కాకపోవడంతో ఆర్నెళ్ల వేతనాలు నిలిచిపోయాయి. ⇒ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తాం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించాలి. ఒక్క నెల కూడా పెండింగ్‌లో పెట్టొద్దు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేర్లు ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పోర్టల్‌లో ఎక్కించలేదనే కారణంతో జీతాలు నిలిపివేశారు. ఏ కారణం ఉన్నా జీతాలు ఆపేందుకు వీలు లేదు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఏజెన్సీ విధానాన్ని మార్చి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి మాకు వేతనాలు చెల్లించాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం 19 రోజులుగా సమ్మె చేస్తున్నాం మాకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నాం. వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉద్యోగులెవరైనా ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే అల్లాడిపోతారు. అలాంటిది మాకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి విసుగెత్తాం.అందుకే మున్సిపాలిటీల ముందు సమ్మెకు దిగాం. 19 రోజులుగా నిరసన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. – శంకరమ్మ, స్వీపర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ -
విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తారా?
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిల కోసం పిటిషన్ దాఖలు చేసిన కక్షిదారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చుల కింద రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆరు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన ఎం.అబ్రహంను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయన 1991లో లేబర్ కోర్టును ఆశ్రయించారు. లేబర్ కోర్టు అబ్రహం తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 1996లో తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగానే తనకు 1997 నుంచి 2002 వరకు వేతన బకాయిలు చెల్లించేలా ఆదేశించాలంటూ అబ్రహం లేబర్ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఆ వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్రహంను ఉద్యోగంలోకి తీసుకోవాలని లేబర్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత అతనికి కాల్ లెటర్ పంపామని, ఆయన స్పందించలేదని కోర్టుకు నివేదించారు. పైపెచ్చు 1992లోనే అతను తపాలా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టారని వివరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తూనే, మరో వైపు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిలు కోరుతున్నారని, దీని వెనుక అబ్రహంకు దురుద్దేశాలున్నాయని వివరించారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలన్న లేబర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అబ్రహం అదే ఏడాది హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల జస్టిస్ నరేందర్ ధర్మాసనం తుది విచారణ జరిపింది. సాంఘిక సంక్షేమ అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అప్పాధరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అబ్రహం తపాలా శాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిలు ఎలా కోరతారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. స్వీయ లాభం పొందే ఉద్దేశంతోనే అబ్రహం ఈ అప్పీల్ దాఖలు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగంలో చేరకుండా వేతన బకాయిలు ఎలా కోరతారని ప్రశ్నించింది. కోర్టు ప్రక్రియ దుర్వినియోగానికి ఇది మచ్చుతునక అని తెలిపింది. న్యాయ ప్రక్రియ ఉన్నది న్యాయం చేయడానికి, కక్షిదారుల హక్కుల పరిరక్షించడానికి మాత్రమేనంది. కోర్టు అత్యంత విలువైన సమయాన్ని అబ్రహం వృథా చేశారని, ఆయన తీరును మన్నించలేమని స్పష్టం చేసింది. అందువల్ల ఈ అప్పీల్‌ను భారీ ఖర్చులు విధించి మరీ కొట్టేయాలని నిర్ణయించామంది. -
ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు
రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు. వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు చెల్లించలేదని చెత్త వాహనాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్ : జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో నగరంలోని చెత్త వాహనాల డ్రైవర్లు శుక్రవారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో చాదర్‌ఘాట్‌లోని కలెక్షన్ పాయింట్లో చెత్త భారీగా పేరుకుపోయింది. ఇక్కడి నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. చెత్త సేకరించే భారీ వాహనాలను నిలిపివేయడంతో చాదర్‌ఘాట్ నుంచి ఎమ్జీబీఎస్ వరకు ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్ వల్ల ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
సమ్మెకు దిగిన సులభ్ కార్మికులు
తిరుపతి: టీటీడీ విష్ణు నివాసం వద్ద సులభ్ కార్మికులు సమ్మెకు దిగారు. విష్ణు నివాసం సముదాయాన్ని బుధవారం సులభ్ కార్మికులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ సిబ్బంది, సులభ్ కార్మికుల మధ్య స్వల్ప వాగ్విదం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో భక్తులను కూడా లోపలికి వెళ్లనీయకుండా విజిలెన్స్ అధికారులు గేట్లు వేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితిలో ముగ్గురు మహిళా కార్మికులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు సీఎం బంధువు అయినందువల్లే రెచ్చిపోతున్నారని, భాస్కర్ అనుచరులు మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తున్నారుని పలువురు కార్మికులు ఆరోపణలు గుప్పించారు. భాస్కర్ నాయుడికి చెందిన పద్మావతి కాంట్రాక్ట్ సంస్థను వెంటనే రద్దు చేయాలని సులభ్ కార్మికులు డిమాండ్ చేశారు. -
‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి లండన్ పారిపోయిన విజయ మాల్యా భారత్ రాక కోసం ఒక్క బ్యాంకులే కాదు, ఆయన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగులతో పాటు ఇప్పటికీ కంపెనీ పే రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దాదాపు మూడువేల మంది ఉద్యోగులకు వేతన బకాయిలు, గ్రాట్యుటీల కింద దాదాపు 300 కోట్ల రూపాయలను విజయమాల్యా చెల్లించాల్సి ఉంది. బ్యాంకుల వద్ద మరిన్ని రుణాలు తీసుకొని జీతాల బకాయిలు చెల్లించడంతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను పునరుద్ధరిస్తానని మాల్యా చాలాకాలం పాటు ఉద్యోగులకు మాయమాటలు చెప్పారు. చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే లండన్ చెక్కేశారు. 2012, సెప్టెంబర్ 30వ తేదీన కింగ్‌ఫిషర్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి, 2012, నవంబర్ నెలలో రాజీనామా చేసిన అనిరుధ్ బల్లాల్ తనకు కంపెనీ నుంచి ఏడు నెలల జీతం బకాయిలు రావాలని మీడియాకు తెలిపారు. ఆయన ఇప్పుడు ముంబైలోని ఏర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2013, జూన్ 8న ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను పునరుద్ధరించేందుకు భారత విమానయానం డైరెక్టర్ జనరల్ నిరాకరించడంతో ఇక తాను ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించలేనని మాల్యా చేతులెత్తేశారు. బల్లాల్‌కు సకాలంలో ఉద్యోగం దొరికింది కనుక ఆయన అదృష్టవంతుడు. చాలామంది ఉద్యోగాలు దొరక్క చాలాకాలం కంపెనీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఉద్యోగాలు దొరకని దురదృష్టవంతులు ఉన్నారు. విజయ మాల్యాను లండన్‌లో అరెస్ట్ చేశారని తెలిసి ఎంతో సంతోషించానని, అంతలోనే ఆయనకు బెయిల్ కూడా లభించిందని తెల్సి నిరుత్సాహానికి గురయ్యానని కింగ్‌ఫిషర్ కంపెనీలో ఫ్లైట్ సర్వీసు డైరెక్టర్‌గా పనిచేసిన నీతు శుక్లా చెప్పారు. ఆమె 2014, డిసెంబర్ నెలలో కంపెనీకి రిజైన్ చేశారు. ఆమెకు మూడేళ్ల బకాయిలు రావాలి. విజయ మాల్యా గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ఆయన బ్యాంకులకు ఎగవేసిన రుణాల గురించే మాట్లాడుతుంది తప్ప బాధిత ఉద్యోగుల గురించి మాట్లాడిన సందర్భం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కింగ్‌ఫిషర్ కంపెనీలో సిస్టమ్స్ మేనేజర్‌గా పనిచేసిన రజనీ జైన్ ఇప్పటికీ ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. తాము ఇల్లు కొనేందుకు ప్లాన్ చేసుకొని అడ్వాన్సు చెల్లించిన మూడు, నాలుగు నెలలకే ఎయిర్‌లైన్స్ మూతపడిందని, ఫలితంగా తాము ఇల్లు కొనే ఆలోచనను వదులుకున్నామని ఆమె చెప్పారు. దీని వల్ల తాము అడ్వాన్స్‌గా చెల్లించిన సొమ్మును నష్టపోవాల్సి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు కూడా భారత్‌లోని కంపెనీ పే రోల్స్‌లో 900 మంది ఉద్యోగులు ఉన్నారని ఆమె తెలిపారు. విదేశీ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల విదేశాల్లోని ఉద్యోగులకు కంపెనీ మూతపడినందుకు నష్టపరిహారం కూడా కంపెనీ చెల్లించిందని, ఇక్కడి వారికి జీతం బకాయిలు కూడా చెల్లించలేదని ఆమె వాపోయారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పోయిన కారణంగా నిశ్చితార్థం అయిన తన కొలీగ్ పెళ్లి నిలిచిపోయిందని, ఒకరు కిరాయి ఉంటున్న అద్దె ఇంటి నుంచి ఉన్నపళంగా రోడ్డున పడాల్సి వచ్చిందని, మరొకరి తల్లి ఆత్మహత్య చేసుకుందని తన చేదు అనుభవాలను రజనీ మీడియా ముందు గుర్తుచేశారు. -
ఎన్ హెచ్ 24పై ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతన బకాయిలు చెల్లించాలన్న డిమాండ్ తో 8వ రోజూ ఉధృతంగా ఆందోళన జరుగుతోంది. బుధవారం రోడ్లమీదకు వచ్చిన మున్సిపల్ కార్మికులు పలుచోట్ల పాలకుల దిష్టబొమ్మలను దగ్ధం చేశారు. రాస్తారోకో నిర్వహించారు. నిర్మన్ విహార్ ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 24వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద ఎత్తున బారులు తీరిన వాహనాలతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా, వివిధ శాఖల మంత్రుల ఇళ్లముందు చెత్తవేసి, నిరసన పత్రాలు అంటించి వినూత్నంగా చేపట్టిన తమ పోరాటాన్ని పారిశుద్ధ్య కార్మికులు నేడు కూడా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెగేసి చెబుతున్నారు. అటు ఆప్ ప్రభుత్వం చెత్తను క్లీన్ చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాగా ఈ వ్యవహారంలో ఆప్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. -
పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి
కింగ్ఫిషర్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: వేతన బకాయిల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌ఫిషర్ మాజీ పైలట్లకు ఊరట లభించింది. ముగ్గురు పైలట్లకు వేతన బకాయిలను 10 శాతం వడ్డీతోసహా చెల్లించాలని కింగ్‌ఫిషర్‌ను కోర్టు ఆదేశించింది. ఐదు నెలలకు సంబంధించి 26 లక్షల వేతనాన్ని చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ అహూజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2012 మార్చి నుంచి జూలై మధ్య కాలానికి రూ.25.37 లక్షలను 10 శాతం వడ్డీతో అహూజాకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కింగ్‌ఫిషర్ మరో ఇద్దరు పైలట్లు గార్గ్, అమర్ భాటియాలు కూడా వేతన బకాయిల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది.


