సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిల కోసం పిటిషన్ దాఖలు చేసిన కక్షిదారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చుల కింద రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆరు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన ఎం.అబ్రహంను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయన 1991లో లేబర్ కోర్టును ఆశ్రయించారు.
లేబర్ కోర్టు అబ్రహం తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 1996లో తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగానే తనకు 1997 నుంచి 2002 వరకు వేతన బకాయిలు చెల్లించేలా ఆదేశించాలంటూ అబ్రహం లేబర్ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఆ వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్రహంను ఉద్యోగంలోకి తీసుకోవాలని లేబర్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత అతనికి కాల్ లెటర్ పంపామని, ఆయన స్పందించలేదని కోర్టుకు నివేదించారు.
పైపెచ్చు 1992లోనే అతను తపాలా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టారని వివరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తూనే, మరో వైపు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిలు కోరుతున్నారని, దీని వెనుక అబ్రహంకు దురుద్దేశాలున్నాయని వివరించారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలన్న లేబర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అబ్రహం అదే ఏడాది హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల జస్టిస్ నరేందర్ ధర్మాసనం తుది విచారణ జరిపింది. సాంఘిక సంక్షేమ అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అప్పాధరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అబ్రహం తపాలా శాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారన్నారు.
కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిలు ఎలా కోరతారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. స్వీయ లాభం పొందే ఉద్దేశంతోనే అబ్రహం ఈ అప్పీల్ దాఖలు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగంలో చేరకుండా వేతన బకాయిలు ఎలా కోరతారని ప్రశ్నించింది. కోర్టు ప్రక్రియ దుర్వినియోగానికి ఇది మచ్చుతునక అని తెలిపింది. న్యాయ ప్రక్రియ ఉన్నది న్యాయం చేయడానికి, కక్షిదారుల హక్కుల పరిరక్షించడానికి మాత్రమేనంది. కోర్టు అత్యంత విలువైన సమయాన్ని అబ్రహం వృథా చేశారని, ఆయన తీరును మన్నించలేమని స్పష్టం చేసింది. అందువల్ల ఈ అప్పీల్‌ను భారీ ఖర్చులు విధించి మరీ కొట్టేయాలని నిర్ణయించామంది.
Comments
Please login to add a commentAdd a comment