సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్ : కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్ కడప జిల్లా పూర్వ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్నకు హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
మునిసిపల్ అధికారులు తన షాపులను, ఇంటిలోని పైభాగాన్ని కూల్చేస్తున్నారంటూ కడప జిల్లా, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పి.పద్మావతిబాయి హైకోర్టులో 2020లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారంటూ పద్మావతి హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అప్పటి మునిసిపల్ కమిషనర్ లవన్నను ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరిస్తూ లవన్న కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తేల్చారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకున్నా.. రాజ్యాంగ హక్కు అని తెలిపారు. కౌంటర్‌లో లవన్న తాను చేసిన పనికి క్షమాపణ కోరలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో కోర్టు ప్రతిష్టను దిగజార్చారంటూ పైవిధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment