సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్ ప్రిజన్’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు.
గాజువాక మండలం, తూంగ్లాం గ్రామం సర్వే నంబర్ 29/1లో ఉన్న తమ భూమి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ పి.అజయ్‌కుమార్, మరొకరు హైకోర్టులో 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్లను వారి భూమి నుంచి ఖాళీ చేయించవద్దని ఆదేశించింది. అయినా, అధికారులు ఆ భూమిలో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు.
పిటిషనర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్ తన కౌంటర్‌లో వివరించారు. ఇతర అధికారుల కౌంటర్లను కూడా పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్ట ప్రకారం ఖాళీ చేయించాల్సిందన్నారు. తహసీల్దార్ ఆ పని చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని, అది కూడా కోర్టు ఉత్తర్వులు ఉండగా చేశారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అప్పిలేట్ కోర్టులో సవాలు చేయాలే తప్ప, వాటికి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తేల్చారు. అందువల్ల కోర్టు ధిక్కార చట్టం కింద తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
గాజువాక తహసీల్దార్‌కు 6 నెలలు జైలు శిక్ష
Published Fri, Apr 15 2022 4:53 AM | Last Updated on Fri, Apr 15 2022 12:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment