కింగ్‌ఫిషర్ మూతకు ఇంజన్ సమస్యలూ కారణం: మాల్యా
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ మూతబడ్డానికి కారణాల్లో లోపభూయిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లూ ఒక కారణమని బ్రిటన్‌లో ఉన్న బ్యాంకింగ్ ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు విజయ్‌మాల్యా పేర్కొన్నారు. ఇండిగో, ఎయిర్‌గోలకు విమాన ఇంజన్ల సరఫరాకు సంబంధించి ప్రాట్ అండ్ విట్నీ గ్రూప్‌పై ఏవియేషన్ రెగ్యులేటర్– డీజీసీఏ విచారణకు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మాల్యా ఈ ప్రకటన చేశారు. కింగ్‌ఫిషర్‌కు లోపభూయిష్టమైన ఇంజన్లు సరఫరా చేసినందుకు, ప్రాట్ అండ్ విట్నీ గ్రూప్ కంపెనీ ఐఏఆపై తాము కేసు దాఖలు చేశామని మాల్యా ట్వీట్ చేశారు.
40 మిలియన్ డాలర్ల బదిలీపై సుప్రీం విచారణ
కాగా, తన పిల్లలకు విజయ్‌మాల్యా 40 మిలియన్ డాలర్ల బదలాయించడంపై బ్యాంకింగ్ కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బ్రిటన్ సంస్థ డియోజియో నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో తాను పొందిన మొత్తాన్ని పలు జ్యుడీషియల్ ఉత్తర్వులను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు బదలాయించారని ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం తరఫున సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ విన్నవించారు.