మాల్యాకు మరో ఝలక్‌! | Big blow to Mallya: Karnataka HC orders winding up of United Breweries | Sakshi
Sakshi News home page

మాల్యాకు మరో ఝలక్‌!

Published Wed, Feb 8 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

మాల్యాకు మరో ఝలక్‌!

మాల్యాకు మరో ఝలక్‌!

యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌ను మూసేయండి!
కింగ్‌ఫిషర్‌ బకాయిల వసూళ్లకు ఇదే మార్గం
బ్యాంకుల పిటిషన్‌కు కర్ణాటక హైకోర్టు అనుమతి
మాల్యాకు మరిన్ని చిక్కులు  


బెంగళూరు: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, బ్రిటన్‌లో తలదాచుకుంటున్న  విజయ్‌ మాల్యాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూబీ గ్రూప్‌ మాతృసంస్థ– యునైటెడ్‌ బ్రూవరీస్‌ (హోల్డింగ్స్‌) లిమిటెడ్‌ (యూబీహెచ్‌ఎల్‌)ను మూసివేయాలని కర్ణాటక హైకోర్టు రూలింగ్‌ ఇచ్చింది. యూబీహెచ్‌ఎల్‌ ప్రమోట్‌ చేసిన కింగ్‌ఫిషర్‌ ఎయిల్‌లైన్స్‌ లిమిటెడ్‌ రుణ బకాయిల వసూళ్లకు మాతృసంస్థ మూసివేత తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లను మంగళవారం అనుమతించింది.  ‘‘తమ రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల్లో వైఫల్యానికి గాను ప్రతివాద కంపెనీ– యూబీహెచ్‌ఎల్‌ను మూసివేత, వాటాల అమ్మకమే సమంజసమని ఈ కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది’’ అని హైకోర్టు ధార్వాడ్‌ బెంచ్‌ జస్టిస్‌ వినీత్‌ కొఠారీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బకాయిలు రూ.146 కోట్లు
పీఎన్‌బీ పారీబాస్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను అద్దెకు ఇచ్చిన సంస్థలు, రోల్స్‌ రాయిస్, ఐఏఈ వంటి ఇంజిన్‌ తయారీ సంస్థలు రూ.146 కోట్ల తమ బకాయిలను రాబట్టుకోడానికి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. చట్ట ప్రకారం మూసివేత ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రతివాది ఆస్తులను అధికారిక లిక్విడేటర్‌కు అప్పగించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్‌ను నిర్వహించడానికి సంబంధించిన రుణాలకు యూబీహెచ్‌ఎల్‌ కార్పొరేట్‌ గ్యారెంటార్‌గా ఉంది.

యూబీహెచ్‌ఎల్‌లో మాల్యా వాటా దాదాపు 52.34 శాతం. బ్రిటన్‌లో ఉన్న ఆయనను అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి, రూ.720 కోట్ల ఐడీబీఐ రుణం కేసులో మాల్యాకు వ్యతిరేకంగా నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ తత్సంబంధ అంశాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. మాల్యా, ఆయన కంపెనీల నుంచి రూ.6,203 కోట్లను 11.5 శాతం వార్షిక వడ్డీతో రాబట్టుకునే ప్రక్రియను ప్రారంభించడానికి ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్‌ కన్సార్షియంకు ఇంతక్రితం బెంగళూరు డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement