మాల్యాకు రూ.270 కోట్లు చెల్లించొద్దు..
డియాజియోకు డీఆర్‌టీ ఆదేశం
బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయల రుణ ఎగవేత ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియోతో ఒప్పందం మేరకు ఆయనకు తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను చెల్లించవద్దని ఆ కంపెనీని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ) మంగళవారం ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్‌టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు సంబంధించిన సంస్థ వాట్సన్ లిమిటెడ్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన షేర్లను ట్రిబ్యునల్‌కు అటాచ్ చేయాల్సిందిగా డీఆర్‌టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహల్లి ఆదేశించారు.
బ్యాంకులకు మొట్టికాయలు...
మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి మాల్యా నిరాకరించారు. దీంతో కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఆయనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్‌బీఐ కాన్సార్షియం డీఆర్‌టీని ఆశ్రయించింది.
ఈ నేపథంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, డియాజియోతో మల్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మీకు తెలిసినప్పటికీ.. ఆ సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు తెలుసుకోవడం, తగిన చర్యలు చేపట్టడం వంటివి ఎందుకు చేయలేదని బ్యాంకర్లను బెనహనకల్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని కూడా ఆయన తప్పుబట్టారు. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.