
ముంబై: 2022 నాటికి లక్ష కోట్ల డాలర్ల విలువైన డిజిటల్ సేవల లక్ష్యాన్ని తగిన విధాన చర్యలతో భారత్ చేరుకోగలదని ఓ నివేదిక తెలియజేసింది. ‘‘ఇంటర్నెట్ అన్నది విజ్ఞాన గని. దీనికి ఎటువంటి భౌగోళిక సరిహద్దులు ఉండవు. దేశాల సరిహద్దుల ఆవల కూడా సేవలను ఆఫర్ చేయగలదు. కనుక చట్టపరంగా, నియంత్రణ పరమైన నిబంధనల పరంగా ఈ విభాగాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం’’అని డిజిటల్ ఆర్థిక రంగానికి సంబంధించిన పన్నులపై ఐఏఎంఏఐ, నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది.
భారత్ అంతర్జాతీయంగా సులభతర దేశాల సూచీలో మెరుగైన స్థానాన్ని సంపాదించడం వంటి పలు చెప్పుకోతగ్గ విజయాలను సాధించిందని పేర్కొంది. దేశీ డీజిటల్ సెక్టార్ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ఈ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాల్సి ఉందని సూచించింది. స్థిరమైన, ఊహాజనిత పన్ను విధానాలు డిజిటల్ ఆర్థిక రంగ వృద్ధికి ప్రోత్సాహాన్నిస్తాయని పేర్కొంది. డిజిటల్ రంగం ప్రధానంగా విదేశీ నిధులపై(ఎఫ్‌ఐఐ/ఎఫ్‌డీఐ), టెక్నాలజీ బదిలీలపై ఆధారపడి ఉందని తెలిపింది.
ఈ రెండు అంశాలు కూడా పన్నుల విధానాల పరంగా చాలా సున్నితమైనవిగా పేర్కొంది. ఆన్‌లైన్ ప్రకటనలు, కొనుగోళ్లు, సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌ల అద్దెలు, ఐపీ, క్లౌడ్, సైంటిఫిక్ ఎక్విప్‌మెంట్ తదితరమైనవి చాలా స్టార్టప్‌లకు నిర్వహణ పరంగా సమస్యల్లాంటివని తెలియజేసింది. విదేశీ నిధులు, టెక్నాలజీపై ఆధారపడి ఉండటంతో విదేశీ కంపెనీలు ఆర్జించిన ఆదాయంపై పన్ను అనేది స్థిరంగా ఉండాలని నివేదిక స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment