
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15 శాతం మేర తగ్గడంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సీబీడీటీ) తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018–2019) రూ.12 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రాబట్టాలని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నెల 23 నాటికి రూ.10.21 లక్షలు (85 శాతం) మాత్రమే వసూళ్లయ్యాయి. దీంతో పన్ను రికవరీ ప్రక్రియను మరింత పెంచాలని ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్స్‌కు సీబీడీటీ లేఖలు రాసింది. పన్ను వసూళ్లకు సంబంధించి లక్ష్య సాధన కోసం సీబీడీటీ వివిధ చర్యలు తీసుకుంటోంది.
రీఫండ్‌లు విడుదల చేయకపోవడం, ఆదాయపు పన్ను ఎగవేతదారుల కేసులు విచారణను ప్రారంభించడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి ఆదాయపు పన్ను ఎగవేత కేసులు గత రెండు–మూడేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరును బట్టే పన్ను వసూళ్లు ఉంటాయని, అయితే అర్థిక వ్యవస్థ పనితీరు అంచనాల కంటే బలహీనంగా ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.