ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్ల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో (2014-15, ఏప్రిల్-డిసెంబర్) 13 శాతం పెరిగాయి. 2013 ఇదే కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ.4.84 లక్షల కోట్లు కాగా తాజా సమీక్ష ప్రకారం ఇవి రూ.5.46 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో వసూళ్ల స్పీడ్ 16 శాతం (రూ.7.36 లక్షల కోట్లు) ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే లక్ష్య సాధనకు తగిన స్పీడ్‌లో వసూళ్లు లేవని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వేర్వేరుగా చూస్తే...
కార్పొరేట్ పన్ను వసూళ్లు 12.79 శాతం వృద్ధితో రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్లకు ఎగశాయి.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 12.62% వృద్ధితో రూ.1.90 లక్షల కోట్లకు చేరాయి.
సెక్యూరిటీల లావాదేవీల పన్ను వసూళ్లు 43.44% వృద్ధితో 4,940 కోట్లుగా నమోదయ్యాయి. స్టాక్ మార్కెట్ల ర్యాలీ దీనికి కారణం.
నికర వృద్ధి 7.41 శాతమే..!
కాగా రిఫండ్స్ పోగా మిగిలిన నికర వసూళ్లలో వృద్ధి మాత్రం 7.41 శాతమే కావడం గమనార్హం. ఈ మొత్తం రూ.4.17 లక్షల కోట్ల నుంచి రూ.4.48 కోట్లకు చేరింది. అధిక రిఫండ్స్ వల్ల స్థూల వసూళ్లలో చాలా భాగం ఆవిరైపోయాయి.
లక్ష్యాలు ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల మొత్తం రూ. 13.6 లక్షల కోట్లు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రత్యక్ష పన్నుల్లో వృద్ధి రేటు 16 శాతంగా ఉండాలి. పరోక్ష పన్నుల్లో వృద్ధి రేటు 20 శాతంగా నమోదు కావాలి. అయితే ఈ లక్ష్య సాధన సవాలేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి.