
పసిడి ధర సమీప కదలికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర జూలై 27వ తేదీతో ముగిసిన వారంలో 1.4 శాతం తగ్గి 1,222 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి పతనం ఇది వరుసగా ఇది మూడవవారం. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 4.1 శాతంగా నమెదుకావడం దీనికి నేపథ్యం. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 94.47 వద్ద వారంలో ముగిసింది.
డాలర్ ఇండెక్స్ ర్యాలీ ఖాయమని, పసిడి ధరను ఇది మరింత కిందకు దింపుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వాణిజ్య యుద్ధం తీవ్రత, చైనాసహా పలుదేశాల కరెన్సీ విలువల పతనం పసిడికి సానుకూలమవుతుందని పలువురు భావిస్తున్నారు. కాగా భారత్ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.29,767 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ శుక్రవారం రూ. 68.62 వద్ద ముగిసింది.