హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, కన్ఫెక్షనరీ రంగంలో ఉన్న చిన్న బ్రాండ్లకు ‘డిస్‌ప్లే’ కష్టాలు ఎక్కువయ్యాయి. దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్లతో పోటీ పడలేక సతమతమవుతున్న ఈ కంపెనీలు... తాము తయారు చేసే ఉత్పత్తుల విక్రయం, ప్రదర్శనకు (డిస్‌ప్లే) విక్రేతలకు కాస్త ఎక్కువ మొత్తంలోనే చెల్లించాల్సి రావటంతో చేతెలెత్తేస్తున్నాయి. లిస్టింగ్ చార్జీలు చెల్లిస్తేనే ఉత్పత్తులను అమ్ముతామని రిటైలర్లు చెబుతుండటంతో చిన్న కంపెనీలు మూసివేతే శరణ్యమనుకుంటున్నాయి. దీంతో బిస్కట్స్, కన్ఫెక్షనరీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీల్లో ఒకటి సక్సెస్ అయితే 20 కంపెనీలు మూతపడుతున్నాయనేది మార్కెట్ వర్గాల మాట.
కాంట్రాక్ట్ తయారీలో ఉన్నా..
ఒకానొక దశలో బిస్కట్స్, కన్ఫెక్షనరీ రంగంలో భారత్‌లో 2,000 పైచిలుకు కంపెనీలుండేవి. ఇప్పుడు వీటి సంఖ్య సగానికి పడిపోయింది. చాలా కంపెనీలు పోటీలో నిలవలేక పెద్ద సంస్థలకు కాంట్రాక్ట్ తయారీ యూనిట్లుగా పరిమితమయ్యాయి. నిలదొక్కుకున్న కొన్ని కంపెనీలు మాత్రం అటు కాంట్రాక్ట్ తయారీతో పాటు సొంత బ్రాండ్‌తో ఉత్పత్తుల విక్రయాల్లోకి వచ్చాయి. తయారీ నైపుణ్యం ఉండడం వీటికి కలిసొచ్చే అంశం.
ఇలా ఒకానొక దశలో 100 బ్రాండ్ల వరకు కార్యకలాపాలు సాగించాయి. నేడు వీటి సంఖ్య 20కి చేరినట్లు ‘డ్యూక్స్’ బ్రాండ్‌తో బిస్కట్స్, కన్ఫెక్షనరీ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీ రవి ఫుడ్స్ ఎండీ రవీందర్ అగర్వాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. లిస్టింగ్, డిస్‌ప్లే చార్జీలు చిన్న కంపెనీలకు భారంగా పరిణమించాయి.
రిటైలర్ స్థాయినిబట్టి 15 చదరపు అడుగుల్లో డిస్‌ప్లేకు ఏడాదికి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అయితే డిస్‌ప్లే ఉంటేనే బ్రాండ్‌కు ఇమేజ్ రావడంతోపాటు అమ్మకాలు పెరుగుతాయని ఎస్‌ఎస్ శ్రీ ఫుడ్స్ ఫౌండర్ గన్ను సత్యకళా రెడ్డి తెలిపారు. పెద్ద బ్రాండ్లతో పోటీపడాలంటే ఖర్చు చేయక తప్పదన్నారు.
ఇదీ భారత మార్కెట్..
భారత్‌లో బిస్కట్స్ వార్షిక విపణి రూ.28,000 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం. కన్ఫెక్షనరీ పరిశ్రమ విలువ రూ.14,000 కోట్లు. వ్యవస్థీకృత రంగానిది 60 శాతం వాటా. చిన్న కంపెనీలు గతంలో తమ విక్రయాలకు గ్రామాలపై ఎక్కువగా ఆధారపడేవి. పరిస్థితులు మారటంతో గ్రామాల్లోనూ పెద్ద బ్రాండ్ల పట్ల కస్టమర్లకు అవగాహన వచ్చింది. చిన్న కంపెనీలు అమ్ముతున్న ధరలోనే అక్కడే పెద్ద కంపెనీల ఉత్పత్తులూ దొరుకుతున్నాయి.
దీంతో కొత్త కంపెనీలు, చిన్న కంపెనీలకు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు విదేశాల నుంచి 50 దాకా బ్రాండ్లు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ కంపెనీల నాణ్యత, మార్కెటింగ్ ముందు దేశీయ చిన్న బ్రాండ్లు కుదేలవుతున్నాయి. ఖరీదైన ఉత్పత్తులను కొనేందుకు కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. కొన్ని కుటుంబాలైతే ప్రీమియం ఉత్పత్తులను కొనడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment