సాక్షి, ముంబై: డీ-మార్ట్ సూపర్ మార్కెట్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాలతో దూసుకుపోతోంది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను తాకింది. సోమవారం డీమార్ట్ షేర్ ధర 1619 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ దూకుడుతో ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 100,440.16 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌మాసంలోనే తొలిసారి సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 బిలియన్ రూపాయల(రూ.90వేల కోట్ల) మార్కును క్రాస్ చేసింది. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. కేవలం రెండు నెలలకాలంలోనే మరో 10వేల కోట్లను మార్కెట్ క్యాప్‌లో జత చేసుకోవడం విశేషం.
డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్‌మార్కెట్‌లో లిస్టు అయిన తొలిరోజునుంచీ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. భారీ లాభాలతో సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసింది. అలాగే రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్చి త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. 65.8 శాతం పుంజుకున్న సంస్థ నికర లాభాలు రూ.251. 8 కోట్లగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ .151.9 కోట్లు నమోదయింది. కంపెనీ ఆదాయం 23 శాతం పెరిగి రూ .4,094.8 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ మార్జిన్ 10.3 శాతంతో 8.63 శాతంగా నమోదైంది.