
దుబాయి: సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్‌ప్లేస్ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది.
అటానమస్ ఎయిర్ టాక్సీని (ఏఏటీ) దుబాయ్‌రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ విజయవంతంగా పరీక్షించింది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేది ఇంకా స్పష్టం చేయలేదు. అత్యాధునిక టెక్నాలజీని, ఆనందాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో తాము మరో మైలురాయిని అధిగమించామని దుబాయ్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. 18 ప్రొపెల్లర్లతో జర్మన్ డ్రోన్ సంస్థ వోలోకాప్టర్ దీన్ని అభివృద్ధి చేసింది. చిన్న, రెండు-సీటర్ హెలికాప్టర్ కాబిన్‌తో దీన్ని రూపొందించింది. దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ కోసం ఏర్పాటు చేసిన వేడుకలో తొలి టెస్ట్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్‌లోఈ వాహనం సుమారు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అలాగే విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా బ్యాక్‌బ్యాటరీలు, రోటర్స్, రెండు పారాచూట్లు లాంటిరక్షణ పరికరాలు కూడా జోడించింది. డ్రైవర్ రహిత ఎగిరే ట్యాక్సీ పనితీరును, ఆపరేషన్‌ను గ్రౌండ్ నుండి మానిటర్ చేసే వ్యవస్థ ఉంటుంది. గరిష్టంగా 30 నిమిషాల పాటు ఎగురుతుంది.
2021 నాటికి ఒక మానవరహిత డ్రోన్‌ను మార్స్ మీదికి పంపాలని దుబాయ్ పథకాలు రచిస్తోంది. తద్వారా అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టబోతోంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం , కరెంట్ టెక్నాలజీని స్వీకరించడం దేశ అభివృద్ధికి దోహదం చేయడం మాత్రమేకాకుండా భవిష్యత్ తరానికి వంతెన వేస్తుందని దుబాయ్ రాజు షేక్ హందాన్ చెప్పారు.
కాగా దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్, ప్రపంచపు అతి పెద్ద మానవ నిర్మిత దీవి ఇలా అనేక రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే.




