డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌ | Dumont plans ice cream plant in Telangana State | Sakshi
Sakshi News home page

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

Published Fri, Jul 19 2019 6:09 AM | Last Updated on Fri, Jul 19 2019 6:09 AM

Dumont plans ice cream plant in Telangana State - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం ఐస్‌క్రీమ్‌ మార్కెట్లోకి కొత్త బ్రాండ్‌ ‘డుమాంట్‌’ ప్రవేశించింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో 10 స్టోర్లను తెరిచిన ఈ కంపెనీ.. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో 100 ఔట్‌లెట్లను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. మూడేళ్లలో ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ అడుగుపెడతామని డుమాంట్‌ ఎండీ వివేక్‌ అయినంపూడి తెలిపారు. గురువారమిక్కడ డుమాంట్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్రాండ్‌ డైరెక్టర్‌ సుమన్‌ గద్దె, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ చైతన్య బోయపాటితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి 300 కేంద్రాల స్థాయికి వెళతామన్నారు. సొంత స్టోర్లతోపాటు ఫ్రాంచైజీల ద్వారా కూడా నెలకొల్పుతామని చెప్పారు. ఫ్రాంచైజీ కోసం ఇప్పటికే 40కి పైగా ఎంక్వైరీలు వచ్చాయన్నారు. తొలి ఏడాది రూ.12–15 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు వెల్లడించారు. డుమాంట్‌ ఉత్పత్తుల అభివృద్ధికి రూ.3 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు.

భారత్‌లో తొలిసారిగా..
విజయవాడ కేంద్రంగా 20 ఏళ్లుగా ఐస్‌క్రీమ్స్‌ విపణిలో ఈ కంపెనీ విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిన వివిధ బ్రాండ్లలో ఫ్రోజెన్‌ డెసర్ట్‌ను పలు రెస్టారెంట్లు, క్యాటెరర్స్‌కు సరఫరా చేస్తోంది. గంటకు 1,900 లీటర్ల ఐస్‌ క్రీమ్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. విజయవాడ కేంద్రానికి ఇప్పటికే రూ.15 కోట్లు వెచ్చించింది. 10 కోల్డ్‌ స్టోరేజీలను నిర్వహిస్తోంది. ఒకట్రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తామని వివేక్‌ తెలిపారు. గంటకు 3,000 లీటర్ల ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తామన్నారు. ‘డుమాంట్‌ బ్రాండ్‌లో 34 రకాల ఐస్‌ క్రీమ్స్, మిల్స్‌షేక్స్‌ను తీసుకొచ్చాం. అన్నీ స్వచ్చమైన పాలతో చేసినవే. భారత్‌తోపాటు పలు దేశాల నుంచి తాజా పండ్లను సేకరించి వీటి తయారీలో వాడుతున్నాం. బ్లూబెర్రీ చీస్‌కేక్, కారామెలైజ్డ్‌ పైనాపిల్, చాకో ఆరేంజ్, మాపుల్‌ అండ్‌ రైసిన్స్, ఖీర్, థాయ్‌ టీ వంటి వెరైటీలు భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టినవే. కొత్త రుచుల అభివృద్ధిలో ప్రత్యేక విభాగం నిమగ్నమైంది’ అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement