
ముంబై: రికవరీ అవుతోందనుకున్న రూపాయి... మళ్లీ పతన బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ డాలర్ మారకంలో 50 పైసలు పడి 71.32 వద్ద ముగిసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి అంశాల ప్రభావం రూపాయిపై పడుతోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది. క్రూడ్ ధరలు తగ్గడం, దేశంలోకి తాజాగా వచ్చిన విదేశీ నిధులు దీనికి కారణం. అయితే ఈ స్థాయిలో రూపాయి నిలబడలేక బలహీన ధోరణిలోకి జారింది. ఇందుకు ప్రధాన కారణాలను చూస్తే...అధ్యక్షుల సమావేశంతో ముగిసిపోయిందను కున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భయాలు తిరిగి (చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంజూ కెనడాలో అరెస్ట్‌తో) ప్రారంభం కావడం. తగ్గాయనుకున్న క్రూడ్ ధరలు (ఒపెక్, రష్యా చమురు కోతల నిర్ణయంతో) తిరిగి పెరుగుతాయన్న ఆందోళనలు దీనితో కరెంట్ అకౌంట్ లోటుపై హెచ్చరికలు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుందన్న అంచనాలు.
నేడు మరింత డౌన్?
పలు బలహీన అంశాల నేపథ్యంలో రూపాయి సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 71.28 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.44కు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనమూ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి విలువ బలహీనంగా 72.50 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషనలూ ఉన్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతలకు ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉండగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు బిజేపీకి వ్యతిరేకంగా ఉంటే, పతనం మరింత వేగంగా ఉండవచ్చు. రూపాయి మళ్లీ 75వైపు పయనించే అవకాశం ఉందని కొన్ని సంస్థలు విశ్లేషణలు చేస్తున్న విషయం గమనార్హం.