నష్టాల బాటలోనే పసిడి
ముంబై: అంతర్జాతీయంగా బేరిష్ ధోరణి, దేశీయంగా పెద్ద నోట్ల రద్దుతో ఆభరణాలకు డిమాండ్ తగ్గడం తదితర అంశాలతో పసిడి వరుసగా అయిదో వారమూ నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పుత్తడి ధరలపై ఒత్తిడి మరింతగా పెరిగింది. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర అంత క్రితం వారం ముగింపు రూ. 28,530తో పోలిస్తే రూ. 345 నష్టంతో రూ. 28,185 వద్ద ముగిసింది.
ఆభరణాల బంగారం కూడా అంతే నష్టంతో రూ. 28,380 నుంచి తగ్గి రూ. 28,035 వద్ద ముగిసింది. వెండి కిలో ధర మాత్రం రూ. 41,815–40,790 మధ్య కదిలి చివరికి రూ. 775 లాభంతో రూ. 41,565 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం రేటు ఫిబ్రవరి అనంతరం కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఈటీఎఫ్‌ల అమ్మకాలు మందకొడిగా ఉండటం తదితర అంశాల కారణంగా 2017లో పసిడి ధరల అంచనాలను ఔన్సుకు (31.1 గ్రాములు) 1,438 డాలర్ల నుంచి 1,338 డాలర్లకు తగ్గిస్తున్నట్లు క్రెడిట్ సూసీ గ్రూప్ వెల్లడించింది.