భారత్‌లో ఆర్థిక వృద్ధి పటిష్టం: ఓఈసీడీ
లండన్: భారత్‌లో ఆర్థిక వ్యవస్థ పటిష్ట రీతిలో వృద్ధి చెందుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) సోమవారం పేర్కొంది. అయితే అమెరికా, చైనాసహా పలు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంలో ఉందని పేర్కొంది. ఈ మేరకు సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇది ఉద్దీపన ప్రభావంగా కనిపిస్తోందని వివరించింది. కాంపోజిట్ లెండింగ్ ఇండికేటర్స్ (సీఎల్‌ఐ) ప్రాతిపదికన ఈ విశ్లేషణ విడుదలైంది.
భారత్‌కు సంబంధించి ఈ సూచీ నవంబర్‌లో 99.3 వద్ద ఉండగా, డిసెంబర్‌లో 99.4 వద్ద కు చేరింది. 2014 ఆగస్టు నుంచీ ఈ సూచీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కాగా ఆర్థిక వృద్ధికి కంపెనీలపై పాలనా, నియంత్రణల పరమైన అవరోధాలను తగ్గించాలని భారత్‌ను ఓఈసీడీ కోరింది. ముఖ్యంగా దేశంలో మౌలిక రంగం వృద్ధికి ఈ చర్యలు అవసరమని సూచించింది. టెలికం, పౌర విమానయానం, రైల్వేలు, రక్షణ, నిర్మాణ, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ఉన్న అడ్డంకులను మరింత తగ్గించాలని పేర్కొంది.